జీతం వ‌ద్ద‌న్న ఐఏఎస్ అధికారి.. వాళ్లకు ఇచ్చిన త‌రువాతే ఇవ్వండి

పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వంటవాళ్లకు వేతనాలు చెల్లించిన తర్వాతే తన జీతాన్ని తీసుకుంటానని ఐఏఎస్ అధికారి ప్రకటించారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 March 2023 10:55 AM IST
జీతం వ‌ద్ద‌న్న ఐఏఎస్ అధికారి.. వాళ్లకు ఇచ్చిన త‌రువాతే ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వంటవాళ్లకు సక్రమంగా వేతనాలు చెల్లించిన తర్వాతే తన జీతాన్ని తీసుకుంటానని ఒక ఐఏఎస్ అధికారి ప్రకటించారు. వేతనాల చెల్లింపు సమస్య ఆయన దృష్టికి వెళ్లడంతో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఈ విధంగా స్పందించారు.

పాఠశాలల సాధారణ తనిఖీల్లో భాగంగా కొద్దిరోజుల క్రితం కాకినాడలోని జిల్లా పరిషత్ పాఠశాలను ప్రవీణ్ ప్రకాశ్ సందర్శించారు. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా మధ్యాహ్న భోజన సిబ్బందికి, మన బడి నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ, ఇతర విధులు నిర్వర్తిస్తున్న ఆయాలకు జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని తెలిపారు. మొత్తం 88,296 మంది వంట మనుషులు, 46,661 మంది ఆయాలకు నెలవారీ వేతనాలు చెల్లించాల్సి ఉంది.

ఈ విషయమై ఆయన మార్చి 10న సహాయ కార్యదర్శి, డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్సింగ్‌ అధికారి (డీడీవో) కు లేఖ రాశారు. ప్రతి నెల ఆయాలు, వంట చేసేవారికి చెల్లింపులు జరిగిన తర్వాత మాత్రమే తన జీతం బిల్లును ప్రాసెస్ చేయాలని వెంకటేశ్వర్లు అభ్యర్థించారు. లెటర్ కాపీని మిడ్ డే మీల్ డైరెక్టర్ డాక్టర్ నిధి మీనాకు కూడా పంపారు. ప్రవీణ్ ప్రకాష్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ "వంటలు చేసే వారికి, ఆయాలకు వారి నెలవారీ జీతం చెల్లించిన తర్వాత మాత్రమే నేను జీతం తీసుకుంటాను. ఈ పద్ధతి ఈ నెల నుండి అమలులోకి వస్తుంది." అని అన్నారు.

ఆయాలు, వంటవారు పాఠశాల విద్యకు (పోషకాహారం మరియు మౌలిక సదుపాయాలు) వెన్నెముక వంటివారు. మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో మొత్తం 46,661 మంది ఆయాలను నియమించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు 44,392 పాఠశాలలకు 88,296 మంది వంటవాళ్లను నియమించారు. గౌరవ వేతనాన్ని అందించడంలో పారదర్శకంగా ఉండడమే కాకుండా వేగవంతమైన పద్ధతిని పాటించాల్సి ఉంటుందని, బిల్లు ప్రాసెస్ చేసిన తర్వాత బిల్లు మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందని ఆయన అన్నారు. లేఖలో ఆయన ఐదు దశల చెల్లింపు ప్రక్రియను కూడా వివరించారు.

ప్రవీణ్ ప్రకాష్ ప్రకారం.. ప్రభుత్వం, ప్రతి స్థాయిలో ( మండల, జిల్లా స్థాయిలలో) బిల్లులను అప్‌లోడ్ చేయడానికి సమయాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిస్తుంది. ఈ గొలుసులో చేసే ఆలస్యాల కారణంగా వంటవారు, ఆయాలకు సకాలంలో గౌరవ వేతనం అందదు అని అన్నారు. ఏదైనా ఒక స్థాయిలో బిల్లును అప్‌డేట్ చేయడంలో ఆలస్యం జరిగితే 30 రోజుల పాటు చెల్లింపు ఆలస్యం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన విధంగానే ఆయాలు, వంట మనుషులందరికీ వేతనాలు అందేలా అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నెలవారీ నివేదిక:

ఆయాలు, కుక్‌లందరికీ జీతాలు అందాయో లేదో పొందుపరిచి నెలవారీ నివేదిక సమర్పించాలని డైరెక్టర్ ఎండిఎంను ప్రవీణ్ ప్రకాష్ కోరారు. డైరెక్టర్ ఎండిఎం నుండి లేఖ అందిన తర్వాత ప్రతి నెలా కంప్లైంట్ రిపోర్టును ఫార్వార్డ్ చేస్తానని చెప్పారు."ఎప్పుడైతే అందరు ఆయాలు, కుక్‌లకు జీతం ఆ నెల చెల్లింపు పూర్తవుతుందో ఆ తర్వాత మాత్రమే నేను నా జీతాన్ని అందుకుంటాను" అని అన్నారాయన.

Next Story