రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేశారు. ఢిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్, ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోరంకిలోని ఓ ప్రైవేటు కన్వెక్షన్ సెంటర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్, సీఎం జగన్ లతో పాటు పలువురు ప్రమఖులు పాల్గొని రాష్ట్రపతిని సత్కరించనున్నారు. అనంతరం రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ అధికారిక విందు ఇవ్వనున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం విశాఖలో జరిగే నేవీడే ఉత్సవాల్లో రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా ముఖ్య అతిథిగా హాజరై, విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు ఇదే వేదిక పై నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తారు. ఆ తరువాత తిరుపతికి వెలుతారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడి గోశాలను సందర్శిస్తారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అనంతరం తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి వెళతారు.