విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దారిద్య్ర బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీలలితాదేవి. ఆమె త్రిపురా త్రయంలో రెండో స్వరూపం. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. ఈ తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. చిదగ్నికుండ సంభూతా అని లలితా సహస్త్రనామం చెబుతోంది.
సకల విశ్వచైతన్య శక్తి స్వరూపం శ్రీచక్రం. ఈ శ్రీ చక్రానికి అధిష్టాన దేవత లలితా త్రిపురసుందరి. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.