కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. బెంజిసర్కిల్ రెండో ఫ్లై ఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు భూమిపూజ చేయనున్నారు. మున్సిపల్ స్టేడియంతో నిర్వహించే బహిరంగ సమావేశంలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గడ్కరీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.
నిజానికి బెంజిసర్కిల్ రెండో ఫ్లై ఓవర్‌ను గతేడాది డిసెంబరులోనే గడ్కరీ ప్రారంభించాల్సి ఉండగా అప్పట్లో కేంద్ర మంత్రి పర్యటన రద్దైంది. వాహనదారుల అసౌకర్యం కలుగకూడదు అన్న ఉద్దేశంతో ఫ్లై ఓవర్‌పై రాకపోకలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వస్తుండడంతో ఫ్లై ఓవర్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు
బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ కమిషనర్ కాంతిరాణా తెలిపారు. గురువారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. నగరవాసులు ట్రాఫిక్ మళ్లింపునకు సహకరించాలని కోరారు.