ఈ నెలలోనే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సాలు నిర్వహించనున్నారు. ఈ మేరుక విజయవాడ దుర్గగుడి ఈవో డి. భ్రమరాంబ వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. 10 రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఇక మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్ అమ్మవారిని దర్శించుకోని, పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు.
భవానీ భక్తులు దర్శనాలకు మాత్రమే రావాలని, మాల వితరణకు అవకాశం లేదని ఈవో సూచించారు. ఈ ఉత్సవాల కోసం నెల రోజుల ముందే కో ఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, దసర ఉత్సవాలకు టెండర్లు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు మొదలయ్యాయని అన్నారు. 80 లక్షల రూపాయలతో స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఈవో.. ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవని చెప్పారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు.
భక్తులకు రూ.100, రూ.300 టికోట్ల దర్శనాలతో పాటు ఉచిత దర్శనాలు కొనసాగించనున్నట్లు అమె తెలిపారు. ఏడు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, తిరుపతి మాదిరి నాణ్యత కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తామని చెప్పారు. భవానీ భక్తుల కోసం ఛండీహోమం, శ్రీచక్రనవావార్చన, కుంకుమార్చనలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా నగరోత్సవం నిర్వహిస్తామన్నారు. ఆలయం, ఆలయ ప్రాంగణంలో వాటర్ ప్యాకెట్స్ బదులు ఆర్వో వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.