సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
Durgamma appearing in Saraswati Devi Alankaram.శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2022 10:50 AM ISTశరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఆదివారం కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో క్యూలైన్లు అన్ని కిక్కిరిసిపోయాయి. ఆదివారం కూడా కావడంతో ఈ రోజు అమ్మవారిని 2లక్షలకు పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీఐపీలకు ప్రత్యేక దర్శనం ఇవ్వలేమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
భక్తజనుల అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞాన జ్యోతి వెలిగించే జ్ఞాన ప్రదాయినీ సరస్వతి దేవిగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలానక్ష్రత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు.
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ
నిత్యం పద్మాలయాందేవి సామాం పాతు సరస్వతీ
శ్రీసరస్వతీ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ
హంస వాహన సమాయుక్తా విద్యాదాన కరీమమ
సర్వసిద్ధి కరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ