విజయవాడలో డాక్టర్ రవళి సీపీఆర్ చేసి సాయి అనే ఆరేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ నెల 5వ తేదీన అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న ఆరేళ్ల బాలుడు సాయి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. బాలుడికి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో బాలుడిని తల్లిదండ్రులు భుజాన వేసుకుని ఆస్పత్రికి బయల్దేరారు. అటుగా వెళ్తూ వారిని చూసిన డాక్టర్ రవళి.. ఏమైందని అడిగారు. అనంతరం రోడ్డుపై బాలుడిని పడుకోబెట్టి సీపీఆర్ చేశారు. బాలుడి ఛాతిపై చేతితో ఒత్తుతూ ఉండగా.. మరో వ్యక్తి నోటితో గాలి ఊదారు.
ఏడు నిమిషాల తర్వాత అతడిలో కదలిక రాగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. తలకు సిటీ స్కాన్ చేయగా.. ఎలాంటి సమస్య లేదని గుర్తించారు. పిల్లవాడు పూర్తిగా కోలుకోవడంతో వెంటనే డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. తాజాగా సీపీఆర్ చేసిన వీడియో బయటకొచ్చింది. సోషల్ మీడియాలో సదరు వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు డాక్టర్ రవళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సీపీఆర్‌తో బాలుడికి ప్రాణం పోసి వృత్తి ధర్మాన్ని నెరవేర్చానని రవళి అన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలబెట్టేందుకు సీపీఆర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.