పెన్ష‌న్లు తీసేస్తున్నారంటూ ప్ర‌చారం.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చెప్పారంటే..?

CM Jagan has given clarity to the beneficiaries on pensions.పెన్ష‌న్లను తీసేస్తున్నారని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2022 7:45 AM GMT
పెన్ష‌న్లు తీసేస్తున్నారంటూ ప్ర‌చారం.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చెప్పారంటే..?

జ‌గ‌న‌న్న చేదోడు, వైఎస్సార్ మ‌త్స్య‌కార భ‌రోసా, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన‌, అమ్మఒడి, వైఎస్సార్ కాపు నేస్తం స‌హా ప‌లు ప‌థ‌కాల‌కు అర్హులైన‌ప్ప‌టికీ ఏ కార‌ణం చేత‌నైనా ల‌బ్ధి పొంద‌ని వారికి మ‌రో అవ‌కాశం క‌ల్పిస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్ల నిధుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి వారి ఖాతాల్లో జ‌మ చేశారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ.. పెన్ష‌న్లను తీసేస్తున్నారని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక‌సారి పెన్ష‌న్ల‌పై ఆడిట్ జ‌ర‌గాలన్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేష‌న్ మాత్ర‌మే చేస్తార‌న్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క‌రి పెన్ష‌న్‌ను తీసేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అర్హులంద‌రికి పెన్ష‌న్ అందాలి అని అన్న‌దే త‌మ‌ ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌న్నారు. త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని సూచించారు సీఎం జ‌గ‌న్‌.

గత ప్రభుత్వంలో పెన్షన్‌ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమేన‌ని, అయితే.. ఇప్పుడు నెలనెలా పెన్షన్‌ బిల్లు రూ.1770 కోట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చార‌ని, అదే మ‌న ప్ర‌భుత్వంలో 62 ల‌క్ష‌ల మందికి ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త ప్రభుత్వంలో రూ. వెయ్యి మాత్ర‌మే పెన్షన్ గా ఇచ్చేవారని, తాము మాత్రం రూ.2750కి పెంచుతూ ఉన్నామ‌ని చెప్పారు.

మాది రైతులు, పేద‌ల క‌ష్టాలు తెలిసిన ప్ర‌భుత్వం. ఏ ఒక్క ల‌బ్ధిదారుడు న‌ష్ట‌పోకూడ‌ద‌నే మా ల‌క్ష్యం. లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశాం. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించాం. ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వెరిఫై చేసి ఏటా రెండు దఫాలు ప్రయోజనాన్ని అందిస్తున్నాం. అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు.

Next Story