గుంటూరు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన
Chief Minister Jagan visits Guntur district today.గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు(శుక్రవారం)
By తోట వంశీ కుమార్ Published on 18 Feb 2022 10:33 AM ISTగుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు(శుక్రవారం) పర్యటించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడే(అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌లో) తయారు చేయనున్నారు. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. కేవలం రెండు గంటల వ్యవధిలో 50 వేల మందికి ఆహారం తయారు చేసే విధంగా భోజనశాలలో ఏర్పాట్లు ఉన్నాయి. రుచి, శుచే లక్ష్యంగా ఆ సంస్థ పాఠశాల విద్యార్థుల కడుపు నింపుతోంది.
అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఇస్కాన్‌కు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ క్షేత్ర నిర్మాణం జరగనుంది. ఆరున్నర ఎకరాల్లో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. అలాగే యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. గోకుల భూమి పూజ అనంతరం సీఎం జగన్ నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.