ఉద్యోగుల నినాదాల‌తో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ ర‌హ‌దారి

BRTS Road swarming with employee's slogans.ఏపీ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన పీఆర్సీ జీవోల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 7:33 AM GMT
ఉద్యోగుల నినాదాల‌తో మారుమోగుతున్న బీఆర్‌టీఎస్ ర‌హ‌దారి

ఏపీ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన పీఆర్సీ జీవోల‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగ సంఘాలు నేడు చ‌లో విజ‌య‌వాడ‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. పీఆర్సీ సాధ‌న స‌మితి పిలుపు మేర‌కు విజ‌య‌వాడ‌కు భారీ సంఖ్య‌లో ఉద్యోగులు త‌ర‌లివ‌చ్చారు. జిల్లాల్లో పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డే అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేసినా.. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజ‌య‌వాడ‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఎన్టీవో భ‌వ‌న్ నుంచి అలంకార్ థియేట‌ర్ కూడ‌లి మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు ర్యాలీగా ముందుకు వెలుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. న్యాయబద్ధమైన తమ హక్కులను కాలరాయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప‌లువురు నేత‌లు మీడియాతో మాట్లాడుతూ.. త‌మ‌ను అణిచివేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తే ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. హ‌క్కుల సాధ‌న కోసం ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నామ‌న్నారు. పీఆర్‌సీ జీవోల‌ను ర‌ద్దు చేసేంత వ‌ర‌కు ఉద్య‌మాన్ని ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెబుతున్నారు. నేనున్నాను.. నేను విన్నాన‌న్న సీఎం జ‌గ‌న్‌.. ఈరోజు తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యానికే ప‌రిమిత‌మ‌వ‌డం దారుణమ‌న్నారు. ప్రెండ్లీ ప్ర‌భుత్వం అంటూ త‌మ‌ను రోడ్డుపైకి ఈడ్చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎన్టీవో భ‌వ‌న్ నుంచి ప్రారంభ‌మైన నిర‌స‌న ర్యాలీ బీఆర్‌టీఎస్ రోడ్డు వైపుకు వెలుతోంది. మ‌ధ్య‌లో పోలీసులు పెట్టిన బారికేడ్ల‌ను తోసుకుంటూ ఉద్యోగులు ముందుకువెలుతున్నారు. పీఆర్‌సీ జీవోల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని ఉద్యోగులు చేస్తున్న నినాదాల‌తో బీఆర్‌టీఎస్ రోడ్డు మారుమోగుతోంది.

Next Story