డీజీపీ నో.. హైకోర్టు ఎస్!
Amaravati farmers Mahapadayatra on September12.రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు
By సునీల్ Published on 10 Sept 2022 2:52 PM IST- మహా పాదయాత్రకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు
- పాదయాత్ర జరిగే సమయంలోనే అసెంబ్లీ ముందుకు త్రీ క్యాపిటల్స్ బిల్లు
రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం మరో మైలురాయిని చేరుకుంటోంది. సెప్టెంబర్ 12వ తేదీకి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా రైతులు మహా పాదయాత్రకు తలపెట్టారు. గుంటూరు జిల్లా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు రాజధాని రైతులు యాత్ర తలపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ప్రభుత్వం, న్యాయస్థానాలు వేర్వేరు ఆదేశాలు జారీ చేశాయి. శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపిస్తూ పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. వెనువెంటనే రైతులు న్యాయస్థానం తలుపు తట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య మహాపాదయాత్రకు అనుమతి లభించింది. దీంతో ఈ వివాదం కొలిక్కి వచ్చింది.
వెయ్యి రోజులుగా ఉద్యమం
2019 డిసెంబరు 17వ తేదీన రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు మండలాలను కలుపుతూ రాజధాని అమరావతిగా నిర్ణయించింది. అయితే అప్పటి నుంచి అమరావతిలో చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలను 'తాత్కాలిక' అని పేర్కొనడంతో తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌంటర్ చేసింది. ఆ రోజు నుంచి రాజధాని గ్రామాల రైతులు ప్రారంభించిన ఉద్యమం వెయ్యి రోజులుగా కొనసాగుతోంది.
వికేంద్రీకరణే మా లక్ష్యం..
రాష్ట్ర విభజనకు పాలనా కేంద్రీకరణే కారణమని, అందుకే ఆంధ్రప్రదేశ్ లో పాలనను వికేంద్రీకరించాలని నిర్ణయించామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే అమరావతిలో ఏర్పాటైన రాజధానిని తరలించేస్తున్నారంటూ ప్రతిపక్షాలన్నీ చేసిన ప్రచారం, భూములిచ్చిన రైతుల్లో మొదలైన ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభించేలా చేశాయి. నాటి నుంచి కోర్టు విచారణలు, ప్రభుత్వ తరలింపు ప్రయత్నాలు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అనంతరం అసెంబ్లీ సాక్షిగా రాజధాని బిల్లును ఉపసంహరించుకుని, ఆ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సరికొత్త మూడు రాజధానుల బిల్లు తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
పోలీసుల ఆంక్షల మధ్య యాత్ర..
అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్రకు అనుమతివ్వాలంటూ పోలీస్ శాఖను కోరగా శాంతిభద్రతలక విఘాతమంటూ డీజీపీ నిరాకరించారు. గతేడాది అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన యాత్రకు కోర్టు ఆదేశాలతో షరతులతో అనుమతులిస్తే.. అన్నింటినీ ఉల్లంఘించారని, ఆ సందర్భంగా వివిధ జిల్లాల్లో మొత్తం 71 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఉద్రిక్తతలు తలెత్తిన కోనసీమ మీదుగా యాత్ర సాగుతుందని, ఆ సమయంలో అక్కడ చిన్నపాటి గొడవ జరిగినా పెద్ద సమస్యగా మారి శాంతిభద్రతలకు విఘాతంగా మారుతుందని, అందుకే అనుమతి నిరాకరిస్తున్నట్టు డీజీపీ పేర్కొన్న మరుసటి రోజునే రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 600 మందికి పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగుతుందని, పాదయాత్ర ముగింపు రోజు బహిరంగ సభ అనుమతి కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులను కోర్టు ఆదేశించింది. ఈ నెల 12న పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లలో రైతు నాయకులు తలమునకలయ్యారు. అయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు పాదయాత్ర కొనసాగుతుండగానే సభ ముందుకు బిల్లు రానుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.