ఆదివారం వచ్చిందంటే చాలు మనలో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే..కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కుళ్లిన మాంసాన్ని తాజా మాంసంతో కలిపి గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. కాగా.. కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో విజయవాడలో మాంసం దుకాణాలపై వీఎంసీ అధికారులు దాడులు చేపట్టారు.
మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్‌నగర్, కొత్తపేట మార్కెట్లలో తనిఖీలు చేపట్టారు. మాచవరంలో 500 కేజీల కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు అధికారులు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారి పై కేసు నమోదు చేశారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నటీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ.. మాంసాన్ని కొనే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కుళ్లిపోయిన మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారన్నారు. అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించిన తరువాతనే మాంసం కొనుగోలు చేయాలని తెలిపారు. కుళ్లిపోయిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా.. పోయిన నెలలో రాణిగారితోటలో 100 కిలోల కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. ఈ మాంసాన్ని గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తుంటే అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ రైల్వేస్టేషన్‌లో వందల కేజీల కుళ్లిన మాంసాన్ని గురించిన సంగతి తెలిసిందే.