విజయారెడ్డి హత్య మానవత్వానికి మచ్చ: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి
By న్యూస్‌మీటర్ తెలుగు
హైదరాబాద్: పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో..మేజీస్ట్రేట్ అధికారాలున్న ఓ అధికారిణిపై దాడి చేయడం దారుణమని మాల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని ఆయన ఆరోపించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ భౌతిక కాయానికి కొత్తపేటలో ఆయన నివాళుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇంతటి ఘోరమైన సంఘటన జరుగుతే న్యాయం చేస్తాం అని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడం దురదృష్టకరమన్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పిలుపు మేరకే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. హత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య మానవత్వాన్ని మంటగలిపేదిగా ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. విజయారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించిన ఆయన ప్రభుత్వ అధికారిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తనను చాలా బాధను కలిగించిదని తెలిపారు. విజయారెడ్డి ఉన్నతమైన అధికారిగా పనిచేసిందని..ఎన్నో రైతుల సమస్యలను పరిష్కరించిందన్నారు. ఇంతటీ ఘోరమైన ఘటనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.