భార‌త బ్యాంకులకు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి లండ‌న్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త‌, లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాకు చుక్కెదురైంది. భారతదేశానికి త‌న‌ను అప్పగించాలని వెలువడిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా లండన్ హైకోర్టులో మాల్యా చేసిన అప్పీల్ ను ఆ కోర్టు కొట్టి వేయ‌గా.. అక్క‌డి సుప్రీం కోర్టును మాల్యా ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ పిటిష‌న్ ను అక్క‌డి సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది.

దీంతో బ్రిట‌న్‌లో మాల్యాకు న్యాయ‌ప‌రంగా ఉన్న దారులు మూసుకుపోయిన‌ట్లైంది. మరో 28 రోజుల్లోగా మాల్యాను భార‌త్‌కు అప్ప‌గించే ప్ర‌క్రియ‌ను బ్రిట‌న్ హోంశాఖ చేప‌ప‌ట్ట‌బోతోంది. బ్రిటిష్‌ చట్టాల ప్రకారం 28 రోజుల వ్యవధి తక్షణమే కౌంట్‌డౌన్‌ ప్రారంభవుతుందని, నెలరోజుల లోపే మాల్యా భారత్‌లో ఉంటారని భారత దర్యాప్తు సంస్ధల వర్గాలు వెల్లడించాయి. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వ‌ద్ద మాల్యా రూ.9వేల కోట్ల‌ను రుణంగా తీసుకున్నారు. అనంత‌రం 2016లో బ్రిట‌న్‌కు వెళ్లిపోయాడు. దీంతో భార‌త ప్ర‌భుత్వం మాల్యాపై కుట్ర‌, మ‌నీలాండ‌రింగ్ అభియోగాలు న‌మోదు చేసింది.

ఇదిలా ఉంటే.. తాను తీసుకున్న రుణాల‌ను పూర్తిగా చెల్లిస్తాన‌ని.. త‌న‌పై పెట్టిన కేసుల‌న్ని కొట్టివేయాల‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని విజ‌య్ మాల్యా విజ్ఞ‌ప్తి చేశాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *