వైద్య సౌకర్యాలు కూడా సరిగా లేని చిన్న దేశం.. కరోనాను ఎలా కట్టడి చేసిందంటే..

By అంజి  Published on  28 March 2020 3:13 AM GMT
వైద్య  సౌకర్యాలు కూడా సరిగా లేని చిన్న దేశం.. కరోనాను ఎలా కట్టడి చేసిందంటే..

''చిన్న దేశమే అయినా కరోనాను కట్టడి చేసింది' ఓ దిన పత్రిక కథనం మేరకు..

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా దెబ్బకు అగ్ర దేశమైన అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన ఇంగ్లాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, ఇరాన్‌ దేశాలు అతలాకుతలం అయ్యాయి. అయితే చైనా పక్కనే ఉన్న వియత్నాం మాత్రం కరోనాను జయించింది. వైరస్‌ను విజయవంతంగా కట్టడి చేసింది. ఇక్కడ కరోనా కేసులు వందల్లోనే ఉన్నాయని.. అక్కడి ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇక మృతుల సంఖ్య సున్నా అనే చెప్పాలి. వియత్నాంలో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రమే.. అయితే కరోనాను ఈ చిన్న దేశం ఎలా కట్టడి చేసిందనేదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

ముందుగానే ఊహించిన వియత్నాం..

2019 చివరి నెలల్లో కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై అప్పటికి చైనా పూర్తిగా అధ్యయనం కూడా చేయలేదు. ముందుగానే పసిగట్టిన వియత్నాం.. చైనాతో సరిహద్దును దాదాపు మూసివేసింది. ఇక కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత పలు ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు విధించింది. తమ దేశంలో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రమేనని అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు అంచనా వేశారు. చైనాలో జనవరి 20 నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభం అయ్యింది.

వియత్నం రాజధాని హోచిమిన్‌ సిటీ. నగర జనాభా 8 మిలియన్లు. ఈ నగరంలో ఐసీయూ పడకల సంఖ్య 1000 లోపే. దీంతో వారు మొదటగా కరోనా బాధితులను గుర్తించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారందరినీ క్వారంటైన్‌ కేంద్రాలను తరలించారు. అంతటితో ఆగకుండా.. కరోనా బాధితులు సన్నిహితంగ ఉన్న వారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇది మొత్తం ఒక ఉద్యమాన్నే తలపించింది. కరోనా బాధితులను కనుగొనడంలో అధికార కమ్యూనిస్టు పార్టీ సభ్యుల చాలా కీలక పాత్ర పోషించారు.

Also Read: అన్నీ చెబుతాం.. మిగిలింది అదొక్కటే: చైనా

లాక్‌డౌన్‌..

దేశంలో మూడు నుంచి నాలుగు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగింది. ఆ తర్వాత కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే అధికార పార్టీ.. కరోనా బాధితులపై నిఘా కొనసాగించింది. వారితో తిరిగిన వారికి కరోనా పాజిటివ్‌ అని తేలగానే క్వారంటైన్‌ కేంద్రాలను తరలించింది. చాలా మందిని గృహనిర్బంధం చేశారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. అప్పుడే ప్రజలు దేశానికి సేవ చేసినవారు అవుతారని ప్రభుత్వం ప్రచారం చేసింది. దాంతో పాటు శానిటైజర్లు, మాస్కులు సరఫరా చేసింది. కరోనా ప్రభావం అప్పటికే ఆ దేశ ఆర్దిక వ్యవస్థపై పడింది. దీంతో వెంటనే అక్కడి ప్రభుత్వం పలు ఉద్దీపన పథకాలను ప్రకటించింది.

చైనా పక్కనే ఉన్న వియత్నాంలో ఇప్పటి వరకు ఒక్క కరనా మరణం కూడా సంభవించలేదు. ఆ దేశం ఎంతో ముందు చూపుతో కరోనాని కట్టడి చేసింది.

Next Story