Fact Check : గోవుల మంద వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటన భారత్ లో చోటుచేసుకున్నదా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sep 2020 3:33 PM GMTభారీ వరదల కారణంగా గోవుల మంద కొట్టుకుని పోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు పోస్టు చేస్తున్నారు. అయ్యో గోవులు వరదలో వెళ్ళిపోతున్నాయే అంటూ పలువురు బాధపడుతూ పోస్టులు చేస్తున్నారు.
The SIASAT DAILY కూడా భారీ వర్షాల కారణంగా మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయని చెప్పుకొచ్చింది. భోపాల్, సీహోర్, ఇండోర్ ప్రాంతాలు భారీ వర్షపాతాన్ని చూశాయని వార్తల్లో చెప్పుకొచ్చారు. ఓ హృదయవిదారక ఘటన కూడా మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుందని తెలిపారు. గోవుల మంద వరద నీటిలో కొట్టుకుని పోయిందని వీడియోను వైరల్ చేశారు.
The Free Press కూడా గోవులు వరద నీటిలో కొట్టుకుపోయాయని.. చెబుతూ “Heart Wrenching video of cows being swept away as rains lash Madhya Pradesh’s Sonkatch”. కథనాన్ని రాసుకుని వచ్చింది. సోన్కచ్ లో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
నిజ నిర్ధారణ:
భారతదేశంలోని మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. గోవులు వరద నీటిలో కొట్టుకుని పోయిన ఘటన 'మెక్సికో' దేశంలో చోటుచేసుకుంది.
న్యూస్ మీటర్ వరదనీటిలో గోవులు కొట్టుకుని పోవడంపై కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయడం జరిగింది. ‘cows washed away in floodwaters' అంటూ వెతకగా వైరల్ వీడియో పలు ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సీట్లలోనూ, పలు న్యూస్ వెబ్సైట్లలోనూ కథనాలు వచ్చి ఉండడాన్ని గమనించవచ్చు. గతంలో కూడా ఈ ఘటన కేరళలో చోటుచేసుకుందంటూ వీడియో వైరల్ అయింది. కానీ ఈ ఘటన చోటుచేసుకుంది మెక్సికోలో..!
జులై 27, 2020న “Como Sucedio” అనే మెక్సికన్ వెబ్సైట్ లో వైరల్ అవుతున్న వీడియో కంటే నిడివి ఎక్కువగల వీడియో లభ్యమైంది. “Zacualpan River overflows in Nayarit and drags cattle” అనే హెడ్ లైన్ తో వార్తా కథనాన్ని ప్రచురించారు. జకువాల్పాన్ అనే నది పొంగిపొర్లడం కారణంగా అక్కడ ఉన్న పశుసంపద కూడా వరద నీటిలో కొట్టుకుని పోయిందని తెలిపారు.
హన్నా తుఫాను కారణంగా నయారిత్ రాష్ట్రంలోని జకువాల్పాన్ నదిలోకి వరద నీరు ఎక్కువగా చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. నదీ తీరంలోని చాలా గ్రామాల్లో నీరు వచ్చి చేరింది. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.
మెక్సికన్ వార్తా పత్రిక La Jornada కూడా ఈ ఘటన గురించి కథనాన్ని ప్రసారం చేసింది. వైరల్ అవుతున్న వీడియోపై పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. AltNews, BoomLive, IndiaToday, Factly లో ఇది మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకోలేదని తెలిపాయి.
మధ్యప్రదేశ్ లో ఆవుల మంద నీటిలో కొట్టుకుని పోతోంది అన్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు.' ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది.