అతడో సెలెబ్రిటీ కాకపోవచ్చు.. కానీ ఆయన గురించి తెలిశాక ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు. ఎందుకంటే ఓ అమ్మాయి ప్రాణాలు కాపాడడానికి అతడు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న అమ్మాయి వైద్యం కోసం అతడు చేస్తున్న పని అభినందనీయం.
సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ అయిన వేణు మాధవ్ పెందుర్తి ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అది కూడా రాపిడోలో బైక్ డ్రైవింగ్..! అతడు ఈ పని చేయడానికి ముఖ్య కారణం డబ్బులు అవసరమై కాదు.. ఓ అమ్మాయి ప్రాణాలు కాపాడాలన్న ఆశయమే. 19 సంవత్సరాల స్వరూప అనే అమ్మాయి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతోంది. ఆమెను రక్షించాలంటే మూడు లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. వేణు మాధవ్ ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.

వేణు మాధవ్ కు యూట్యూబ్ లో వార్తలను చూసే అలవాటు ఉంది. అలా చూస్తుండగా ఓ అమ్మాయి తల్లిదండ్రులు తన కుమార్తెను కాపాడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న తన కుమార్తెను కాపాడాలని.. లేదా మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ వీడియో వేణు మనసును తాకింది. ఆమెను ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాడు. 3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలుపగా… తనకు తెలిసిన వారందరికీ సమాచారం ఇచ్చి 1.55లక్షల రూపాయలను పోగు చేశాడు. కానీ ఆమె వైద్యానికి ఇంకొంచెం డబ్బు కావాలి.. అది కావాలంటే మరికొందరికి స్వరూప గురించి తెలియాలి. దీంతో అతడు పార్ట్ టైమ్ జాబ్ గా ర్యాపిడోను ఎంచుకున్నాడు. బైక్ పై తిరుగుతూ ‘రైడ్స్’ లో వచ్చే డబ్బును స్వరూప వైద్యం కోసం అందించాడు.

అలాగే తన బైక్ పై ట్రావెల్ చేసే వారందరికీ స్వరూప పరిస్థితి గురించి వివరించాడు.. వాళ్లకు వీలైనంత సహాయం చేయమని కోరాడు. కొందరు సహాయం చేశారు కూడానూ..! ఓ టీఆర్ఎస్ మెంబర్ స్వరూప గురించి తెలుసుకుని.. ఆపరేషన్ కు అయ్యే ఖర్చును 3 లక్షల నుండి 2.25 లక్షలు అయ్యేలా కుదించాడు. దీంతో వేణుకు కూడా డబ్బు సహాయం చేయడం కాస్త సులువైంది. మాదాపూర్ లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ ను నిర్వహించారు. ప్రస్తుతం స్వరూప ఆరోగ్య పరిస్థితి బాగుంది. ఆమె కోలుకుంటోంది కూడానూ..! ఏది ఏమైనా వేణు చేసిన సహాయం నిజంగా చాలా గొప్పది.

25 సంవత్సరాల వేణు రెగ్యులర్ జాబ్ చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ ఎలా చేయగలుగుతున్నాడంటే ఆ అమ్మాయికి సహాయం చేయాలని అనుకోవడమే. అతడి ఆఫీసు టైమింగ్స్ ఉదయం 11 నుండి సాయంత్రం 8:30 వరకూ.. ఉదయం 6 నుండి 10 వరకూ.. రాత్రి 9 నుండి 11 వరకూ అతడు ర్యాపిడో డ్రైవ్ చేస్తూ సాధ్యమైనంత ఎక్కువ మందికి స్వరూప పరిస్థితిని వివరించేవాడు. 10 రైడ్స్ రోజుకు చేసేవాడు… కొన్ని కొన్ని సార్లు అర్ధరాత్రి 1 గంట వరకూ ర్యాపిడో నడిపి తన టార్గెట్ ను పూర్తీ చేసేవాడు. 5 నుండి 10 మందికి ప్రతి రోజూ స్వరూప గురించి చెప్పేవాడు.. అలాగే మిగిలిన వారికి కూడా స్వరూప గురించి చెప్పాలని వేణు కోరేవాడు. అలా వేణు తనకు ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయి ప్రాణాలు కాపాడడానికి ఎంతగానో కష్టపడ్డాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.