దేవుడిని నమ్మండి..ఓ గుడ్డ మీద నమ్మకం పెట్టుకోకండి అన్నాడు..ఆ తర్వాత..?

By రాణి  Published on  12 April 2020 12:38 PM IST
దేవుడిని నమ్మండి..ఓ గుడ్డ మీద నమ్మకం పెట్టుకోకండి అన్నాడు..ఆ తర్వాత..?

మనల్ని వైరస్ నుండి కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వీలైనన్ని సార్లు చేతులను శుభ్రం చేసుకోవడం.. బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు వాడడం లాంటివి చేయాలి. కానీ కొందరికి మాత్రం మాకేమవుతుంది అన్న గర్వమో, లేక మాస్కు వేసుకోడానికి బద్ధకమో తెలియదు.. మాస్క్ లేకుండానే బయటకు వెళ్తూ ఉంటారు. కానీ మాస్కు తప్పనిసరి అని సూచిస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు లేకుండా బయటకు రాకండి అని సూచిస్తూ ఉన్నాయి.

కొందరు మాస్కుల వాడకంపై అవగాహన కల్పిస్తూ వీడియోలు చేస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం మాస్కు అవసరమే లేదంటూ కొట్టి వేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్లకు గుణపాఠం లాంటిది ఈ వీడియో..! మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మాస్కు అవసరం లేదని చెప్పి టిక్ టాక్ వీడియో చేశాడు. కానీ ఆ తర్వాత అతడికి టెస్టులు చేయగా కోవిద్-19 పాజిటివ్ అని తేలింది. 'దేవుడిని నమ్మండి.. ఓ గుడ్డ మీద నమ్మకం పెట్టుకోకండి' అన్నాడు ఆ 25 సంవత్సరాల యువకుడు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆసుపత్రి బెడ్ మీద ఉండి మరో వీడియో చేశాడు 'నేను బాగుండాలి అని దేవుడిని ప్రార్థించండి ఫ్రెండ్స్' అని అన్నాడు. ఆ యువకుడు చివరిసారిగా పోస్టు చేసిన వీడియో అదే.. ఆ తర్వాత అతని నుండి ఫోన్ ను అధికారులు తీసేసుకున్నారు.

Also Read : భారత్ లో 8000 దాటిన కరోనా కేసులు..అత్యధికంగా మహారాష్ట్రలో

మాస్కు వేసుకోకండి అని ఆ యువకుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. లాక్ డౌన్ సమయంలో అతడు అవసరం ఉన్న వాళ్లకు కూరగాయలను సప్లై చేసే బిజినెస్ చేస్తూ గడిపాడు. అతడి టిక్ టాక్ వీడియోలో సన్ గ్లాస్ పెట్టుకుని కనిపించిన ఆ యువకుడిని 'భాయ్.. వైరస్ స్ప్రెడ్ అవుతోంది కదా.. మాస్కు పెట్టుకోవా అని అడిగారు..?' ఆ ప్రశ్నకు యువకుడు స్పందిస్తూ 'ఈ గుడ్డ ముక్కను నమ్ముకోకండి.. పైన దేవుడు ఉన్నాడు.. ఆయన మీద నమ్మకం పెట్టుకోండి' అని అన్నాడు. ఆ తర్వాత స్టైల్ గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు బయట తిరిగినా మాస్కులు వేసుకోకుండా తిరిగాడని.. స్థానికులు చెప్పుకొచ్చారు. తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడని అన్నారు.

శుక్రవారం నాడు అతడికి టెస్టులు చేయగా.. పాజిటివ్ అని వచ్చింది. సాగర్ లోని బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో అతన్ని అడ్మిట్ చేశారు. ఆసుపత్రి బెడ్ మీద ఉండి పెట్టిన వీడియోలో అతడు చాలా చిక్కిపోయి కనిపిస్తున్నాడు.. నా కోసం ప్రార్థనలు చేయాలి అని కోరాడు. "డాక్టర్లు నాకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేల్చారు.. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.. అలాగే నా కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించండి.. ప్రస్తుతానికి నేను టిక్ టాక్ వీడియోలు చేయలేకపోతున్నాను' అని ఆ వీడియోలో తెలిపాడు. అతడికి కరోనా వైరస్ ఎలా సోకింది అన్నది మాత్రం అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరెవరితో అతడు కాంటాక్ట్ అయ్యాడో.. వారందరినీ గుర్తిస్తున్నామని అన్నారు. జబల్ పూర్ కు అతడు వెళ్ళినప్పుడు కరోనా వైరస్ ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్లి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి అయిదేళ్ల కుమార్తె, భార్య నివసిస్తున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు.

Next Story