శాకాహార ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ సపోర్ట్

By రాణి  Published on  20 Jan 2020 7:29 AM GMT
శాకాహార ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ సపోర్ట్

ముఖ్యాంశాలు

  • నెల రోజులపాటు మాంసాహారానికి దూరం
  • వెజ్ యాన్యువరీకి విస్తృత స్థాయి ప్రచారం
  • ప్రచారానికి సహకరిస్తున్న హాలీవుడ్ స్టార్లు
  • హాలీవుడ్ స్టార్ల పిలుపు, భారీ ప్రచారం
  • తగ్గిన మాంసం, డెయిరీ ప్రాడక్ట్స్ వినియోగం

“ఇకపై ఖచ్చితంగా శాకాహారమే తినాలి. మాంసాహారాన్ని, డెయిరీ ఉత్పత్తులను పూర్తిగా మానేయాలి! కనీసం ఒక్క నెలపాటు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి!” ఇలా అనుకునేవాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుని ఉద్యమాలను ఏర్పాటు చేసుకునే సంస్కృతి కూడా ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రచారంలోకొస్తోంది. సాధారణంగా కొత్త సంవత్సరం మొదటిరోజు నుంచీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అమలుచేయడం, వాటిని కొంతకాలంపాటైనా పాటించడం లాంటి కొత్త నిర్ణయాలు అమలు చేయాలన్న ఆలోచన చాలా మందికి కలుగుతుంది. అలా కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటాను అనుకుని గట్టిగా ఉండేవాళ్ల సంఖ్య రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

అలాగే కొవ్వును అధికంగా శరీరంలోకి చేర్చి డెయిరీ ప్రాడక్ట్స్ ని వినియోగించేవాళ్ల సంఖ్యకూడా చాలా తగ్గిపోతోంది. కచ్చితంగా డెయిరీ ప్రాడక్టులకు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టుకుని, దాన్ని పక్కాగా అమలు చేస్తున్నవాళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. అదిమాత్రమే కాక ఈ రోజుల్లో లభించే అత్యధికశాతం డెయిరీ ప్రాడక్ట్స్ లో జంతువుల మాంసం కచ్చితంగా ఏదో ఒక రూపంలో కలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా కేవలం అలా మాంసంతో కూడిన డెయిరీ ప్రాడక్ట్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇలాంటి నిర్ణయాలను కలుపుకుంటూ విశ్వవ్యాప్తంగా 2020 జనవరి ఒకటో తేదీనుంచీ మాంసాహారాన్ని, డెయిరీ ప్రాడక్టులనూ పూర్తిగా దూరంగా పెట్టాలంటూ మొదలైన ఒక ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది. కేవలం ఒక మాట అనేసుకోవడం, దానికి పూర్తిగా కట్టుబడి ఉండడం, దానివల్ల ఎవరైతే ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టారో పూర్తిగా వాళ్లకే దాని ఫలితాలు దక్కడం లాంటి అనేక కారణాలవల్ల వెజ్ యాన్యువరీ పేరుతో మొదలైన సరికొత్త ఉద్యమానికి వరల్డ్ వైడ్ మద్దతు లభించింది.

192 దేశాలకు చెందిన 7.5 లక్షలమంది మద్దతు

హాలీవుడ్ స్టార్లు సైతం ఈ వెజ్ యాన్యువరీకి సపోర్ట్ చేస్తూ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే దీనికి దక్కిన పాపులారిటీని గురించి అంచనా వేయొచ్చు. 192 దేశాలకు చెందిన 7లక్షల 50 వేలమంది వెజ్ యాన్యువరీ 2020కి మద్దతు పలికి దానిలో భాగస్తులయ్యారు. జాక్వలిన్ ఫినిక్స్, అలిసియా సిల్వెర్ స్టోన్, మాయిమ్ బయాలిక్ లాంటి హాలీవుడ్ స్టార్లు ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. నటాలియా పోర్ట్ మన్ ఓ అడుగు ముందుకేసి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో 5 వందల 90 కోట్ల మంది అభిమానులకు వెజ్ యాన్యువరీలో పాల్గొనమని, ప్రతిజ్ఞ చేయమని సందేశం ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా శాకాహారానికి రోజురోజుకూ పెరుగుతున్న మద్దతును చెప్పకనే చెబుతోంది.

2014లో ఈ క్యాంపెయిన్ యూకేలో మొదలయ్యింది. ఓ జంట కాలక్షేపంకోసం మొదలుపెట్టిన ఈ వ్యవహారం ఇప్పుడు సీరియెస్ గా మారి అనేకమంది శాకాహారం వైపుకు మొగ్గుచూపడానికి దోహదకారి అవుతోంది. జేన్ ల్యాండ్, మాచ్యూ గ్లోవర్ దీని సృష్టికర్తలు. మొదట్లో వాళ్లు శాకాహారంవల్ల జంతువులు ఏ విధంగా లాభపడుతున్నాయో, పర్యావరణానికి ఎలా మేలు కలుగుతుందో, మనుషుల ఆరోగ్య ఎలా మెరుగుపడుతుందో సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ల ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. తర్వాత ప్రత్యేకంగా తమకు మెయిల్ పంపిన వారందరికీ వాళ్లు సందేహాలను నివృత్తి చేయడం మొదలుపెట్టారు. అలా అలా మెల్లగా దీనికి బాగా పాపులారిటీ వచ్చింది. ఈ సందేశాలవల్ల లాభపడ్డవాళ్లు మెల్లగా ఈ దంపతులు మొదలుపెట్టిన సైట్ కి డొనేషన్లు, గిఫ్ట్ లు పంపడం మొదలుపెట్టారు. వాళ్లూ రెట్టించిన ఉత్సాహంతో పనిచెయ్యడం మొదలుపెట్టారు.

ఇప్పుడు ప్రమోటర్స్ మెల్లగా అమెరికాకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించారు. లాస్ ఏంజిలస్ లో ఓ డైరెక్టర్ ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా యూఎస్ కోసం us.veganuary.com సైట్ ని ఏర్పాటు చేశారు. కనీసం ఒక నెల రోజులపాటు మాత్రం నాన్ వెజ్ ని ముట్టుకోకుండా ఉంటే చాలనీ, మిగతా పదకొండు నెలలకు సంబంధించీ తాము అస్సలు క్యాంపెయిన్ చేయడం లేదనీ ప్రమోటర్లు చెబుతున్నారు. ఒక్క నెల రోజులు కనీసం మూడున్నర లక్షలమంది మాంసాహారానికి దూరంగా ఉంటే 45 వేల టన్నుల కర్బన ఉద్గారాలను తప్పించేందుకు వీలవుతుందనీ ప్రమోటర్లు చెబుతున్నారు. వీలైనంతవరకూ ఇలా ప్రతినెలా కొంతమంది చొప్పున కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు.

Next Story