వెదురు ఉంటే భవిష్యత్తుపై బెదురు ఏలా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 6:10 AM GMT
వెదురు ఉంటే భవిష్యత్తుపై బెదురు ఏలా..?!

* ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయం వెదురు

* పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

*సెప్టెంబర్18 ప్రపంచ వెదురు దినోత్సవం

థాయ్‌లాండ్‌: మనిషి జీవితానికి వెదురుకు విడదీయరాని బంధముంది. మనిషి పుట్టక నుంచి చావుదాకా వెదురుతోనే మనిషి జీవితం ముడిపడి ఉంది. శిశువుగా పుట్టినప్పుడు పడుకునే ఊయల..ఆడుకునే బొమ్మలు..మనిషి చనిపోతే శ్మశానానికి మోసుకెళ్లడానికి పాడె కూడా వెదురుతోనే చేస్తారు. అంతలా మనిషి జీవితంతో వెదురు పెనవేసుకుపోయింది.

నేడు వెదురు స్థానాన్ని ప్లాస్టిక్ ఆక్రమించింది. ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు..మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తుంది. భూమి మీదనే కాదు సముద్రంలోనూ జీవరాశుల మనుగడనే దెబ్బతీసేలా పర్యావరణానికి ముప్పుగా వాటిల్లింది ప్లాస్టిక్‌.

థాయ్‌లాండ్‌లోని ఇంపీరియల్ క్వీన్స్ పార్క్‌ హోటల్‌లో 8వ ప్రపంచ వెదురు కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2009 సెప్టెంబర్ 18ని బ్యాంకాక్‌లో థాయ్ రాయల్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ప్రపంచ వెదురు దినోత్సవంగా ప్రకటించింది. 8 వ ప్రపంచ వెదురు కాంగ్రెస్‌లో 41 కి పైగా దేశాల నుంచి 350 మంది పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వెదురుపై అవగాహన పెంచేందుకు కృషి చేయాలని వెదురు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. వెదురు ఉపయోగాలను నేటి తరానికి తెలియజేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. సహజ వనరులు, పర్యావరణాన్ని పరిరక్షించడం, స్థిరమైన వినియోగాన్ని నిర్ధరించడం, ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల కోసం వెదురు సాగును ప్రోత్సహించడం, అలాగే సాంప్రదాయాలను మరిచిపోకుండా చేయడం, వెదురును సమాజ, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు.

వెదురు అత్యంత వేగంగా పెరిగే మొక్క. కార్బన్ డై ఆక్సైడ్ (CO2)ను అధిక మొత్తంలో వినియోగించుకునే అద్భుతమైన సామర్థ్యం వెదురు సొంతం. పెద్ద మొత్తంలో జీవపదార్ధాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. భూములను సారవంతాన్ని పునరుద్ధరించే సామర్థ్యం వెదురుకు ఉంది. నేలను కోతకు గురికాకుండా కాపాడుతుంది వెదురు.

ఒక వెదురు నాటండి, వెదురుతో మాట్లాడండి, వెదురుతో నిర్మించండి, వెదురుతో పాడండి, వెదురు ధరించండి, వెదురులో తినండి, వెదురులో తినిపించండి, వెదురును శ్వాసించండి, వెదురు మధ్యలో నడవండి అనుభూతి పొందండంటూ అనే నినాదంతో ప్రపంచ వెదురు ప్రియులు ప్రజలకు పిలుపునిస్తున్నారు.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రజలు జరుపుకుంటారని..

భూమిని కాలుష్యం నుంచి కాపాడుతారని ఆశిద్దాం.

Next Story