ఆ క్లాసిక్‌కు పదేళ్లు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 2:08 PM GMT
ఆ క్లాసిక్‌కు పదేళ్లు..

కొన్ని సినిమాలు విడుదలైనపుడు థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఆడవు. నిర్మాతలకు నష్టం తెచ్చిపెడతాయి. కానీ కాల క్రమంలో అవి మంచి సినిమాలుగా గుర్తింపు సంపాదిస్తాయి. క్లాసిక్స్‌గా కూడా పేరు తెచ్చుకుంటాయి. అలాంటి సినిమానే 'వేదం'. ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జనాల స్పందన చూస్తే.. ఇన్ని ప్రశంసలందుకుంటున్న చిత్రం అప్పుడు ఎందుకు ఆడట్లేదు అనిపిస్తుంది. ‘గమ్యం’ తర్వాత క్రిష్ భారీ అంచనాలతో ఈ సినిమాను రూపొందించాడు. అల్లు అర్జున్, మంచు మనోజ్‌, అనుష్క మనోజ్ బాజ్‌పేయిల కాంబినేషన్ భలే ఆసక్తి రేకెత్తించింది. కీరవాణి ఆడియో సూపర్ హిట్టయింది. ప్రోమోలన్నీ కూడా ఆకట్టుకోవడంతో విడుదలకు ముందు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఐతే సినిమా చూసిన వాళ్లందరూ బాగుంది అన్నారు కానీ.. ఏదో ఒక చిన్న అసంతృప్తి వెంటాడింది. జనాల్లోకి డివైడ్ టాక్ వెళ్లింది.

దీంతో సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సినిమాలో పని చేసిన పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరైతే వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు టీవీల్లో చూసినా జనాలకు మంచి ఫీలింగే కలుగుతోంది. ఇప్పుడు ‘వేదం’ పదవ వార్షికోత్సవం సందర్భంగా దీన్ని అందరూ పొగిడేస్తున్నారు. చిత్ర బృందం కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి.. దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు అల్లు అర్జున్, మంచు మనోజ్, హీరోయిన్ అనుష్కలతో గ్రూప్ వీడియో కాల్ కూడా చేశారు. అలాగే ఎవరికి వారు ప్రత్యేకంగా ట్విట్టర్ పోస్టులు కూడా పెట్టారు. బన్నీ ఉదయమే ‘వేదం’ గురించి ఎంతో ఉద్వేగంగా ట్వీట్ వేశాడు.

'వేదానికి దశాబ్దం.. ఈ బ్యూటిఫుల్ జర్నీలో భాగస్వాములైన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దర్శకుడు క్రిష్కు నటులు అనుష్క శెట్టి మంచు మనోజ్ మనోజ్ బాజ్ పాయ్కి ఇతర నటులకు టెక్నీషియన్లకు వారిచ్చిన మద్దతుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే కీరవాణి గారికి ఆర్కా మీడియాకు ధన్యవాదాలు చెబుతున్నాను' అని ట్వీట్ చేసాడు అల్లు అర్జున్.

క్రిష్ అయితే చాలా ఇంటెన్స్‌గా అనిపించే ఒక నోట్ తయారు చేసి షేర్ చేశాడు. ‘వేదం’ సినిమాలో క్లాసిక్ సీన్స్, పాటల్ని షేర్ చేస్తూ అభిమానులు కూడా పదో వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.Next Story