చిలకలగూడ హత్య కేసు: బాలిక హత్య కేసులో సంచలన నిజాలు

By సుభాష్  Published on  26 Jan 2020 8:54 AM GMT
చిలకలగూడ హత్య కేసు: బాలిక హత్య కేసులో సంచలన నిజాలు

చిలకలగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వారాసిగూడ బాలిక హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పథకం ప్రకారమే బాలికను హత్య జరిగినట్లు విచారణలో తేలింది. నార్త్‌ జోన్‌ డీసీపీ కమలేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటన ప్రాంతంలో సీసీటీవీ పుటేజీలను పరిశీలించడంతో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ముందుగా అనుమానస్పదంగా బాలిక మృతి చెందినట్లు భావించిన పోలీసులు.. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం బాలికను హత్య జరిగిన విషయం తెలిసిందే. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు భవనాల మధ్య బాలిక మృతదేహం పడి ఉండటం, అక్కడ రక్తపు మరకలు ఉండటం చూసిన పోలీసులు క్లూస్‌టీంను రప్పించి పరిశీలించారు.

ఈ దారుణ విషయం తెలియని కుటుంబీకులకు పోలీసులే సమాచారం అందించారు. పోలీసులు బాలిక కుటుంబీకులను విచారించగా, నిందితుడు సోహెబ్‌ పేరు బయటకు వచ్చింది. కొన్ని రోజుల నుంచి నుంచి తమ కుమార్తె సోహెబ్‌ వేధిస్తున్నాడని మృతురాలి కుటుంబీకులు తెలుపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లో మంచం కింద దాక్కున్న సోహెబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సీసీ కెమెరాలు పరిశీలించగా, నిందితుడు తన ఇంటి నుంచి బయటకు వస్తుండటం, మృతురాలి ఇంటి మేడపైకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అలాగే సోహెబ్‌ ఫేస్‌ బుక్‌ పేజీని ఓపెన్‌ చేసి చూస్తే, సీసీటీవీ పుటేజీలో నమోదైన ఫోటోలతో సరిపోల్చుకుని అతడే నిందితుడని పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల విచారణలో..

గురువారం అర్ధరాత్రి 12:45 గంటలకు సోహెబ్‌ మృతురాలి ఇంటికి వచ్చి టెర్రాస్‌పైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న బాలికతో ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై ఘర్షణ పడ్డాడు. ఇతరులతో చాటింగ్‌ చేయడాన్ని సహించలేని సోహెబ్‌ పక్కనే ఉన్న గ్రానైట్‌ రాయితో బాలికపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు.

మృతదేహాన్ని ఈడ్చుకుంటూ..

బాలిక మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకుంటూ రెండు భవనాల మధ్య కిందికి తోసేసి వెళ్లిపోయాడు. తర్వాత బాలిక మృతి చెందిందా ..? లేదా అనే విషయం తెలుసుకునేందుకు నిందితుడు మరో మారు తెల్లవారుజామున రూ. 3:15 గంటలకు అక్కడికి వచ్చి బాలిక చనిపోయినట్లు నిర్ధారించుకున్నాడు. రెండు మారు వచ్చిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ హత్య జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు చేధించడంపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు అభినందించారు.

పదో తరగతి నుంచే ప్రేమ వ్యవహారం

కాగా, మృతురాలు, నిందితుడు సోహెబ్‌ పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో విద్యనభ్యసించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. బాలికను పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె కుటుంబీకులకు తెలుపగా, బాలిక చదువుకుంటుందని, పైగా మైనర్‌ ఉందని ఒప్పుకోలేదు. కాగా, కొన్ని రోజులుగా బాలిక నిందితుడు సోహెబ్‌ను పట్టించుకోవడం మానేసింది. దీంతో బాలికపై కోపం పెంచుకున్న సోహెబ్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడని నార్త్‌ జోన్‌ డీసీపీ కమలేశ్వర్‌ పేర్కొన్నారు.

Next Story
Share it