భారత ప్రభుత్వం ప్రజల వాహనాల కోసం ఏర్పాటు చేసిన “వాహన్” వెబ్ సైట్ లో ఉంచిన సమాచారాన్ని ఢిల్లీ అల్లర్లలో ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి ఉపయోగించిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. వాహన్ జాతీయ స్థాయిలో వివిధ వాహనాల రెజిస్ట్రీ. ఇందులో 25 కోట్ల వాహనాల వివరాలు ఉంటాయి. దీని ఆధారంగా ఏ వాహనాన్నైనా గుర్తించవచ్చు. వాహన యజమానిని గుర్తించవచ్చు. తద్వారా వ్యక్తిని అరెస్టు చేయవచ్చు.

అయితే ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ఎలాంటి ఆధారాలూ లేకపోయినా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మాత్రం ఈ విషయంలో గగ్గోలు పెడుతున్నాయి. దీని వల్ల ప్రజలకు, ముఖ్యంగా మైనారిటీ వర్గాల వారికి ఇబ్బందులు కలగవచ్చునని ఈ సంస్థలు అంటున్నాయి. ఎవరైనా ఈ రెజిస్ట్రీని యాక్సెస్ చేయవచ్చునని, దీని ద్వారా వాహన యజమానుల వివరాలు తెలుసుకోవచ్చునని, భారతదేశం వంటి దేశాల్లో పేరు తెలిస్తే చాలా విషయాలు తెలిసినట్టేనని ఈ సంస్థలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఎం పరివాహన్ యాప్ సహా పలు యాప్ లలో వాహనాల సమాచారం ఉందని ఈ సంస్థలు చెబుతున్నాయి.

అల్లరి మూకలు వాహనాల వివరాలు, వాటి యజమానుల వివరాలను తెలుసుకుని, వారి వాహనాలను తగులబెట్టవచ్చునని ఈ సంస్థలు వాదిస్తున్నాయి. వాహనాలు ఉన్న చోటకి అటూ ఇటూ వ్యక్తుల ఇళ్లు ఉంటాయని, వాటిపై దాడి చేయవచ్చునని వీరు వాదిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వాహన్ డేటాబేస్ ను సాధారణ పౌరులకు అందకుండా చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఒక పిటిషన్ ను సమర్పించింది. డేటా బేస్ ను అందరికీ అందుబాటులో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని ఇంటర్నేషనల్ ఫ్రీడం ఫౌండేషన్ పార్లమెంటరీ, పాలసీ సలహాదారు సిద్ధార్థ్ దేబ్ వాదిస్తున్నారు.

అయితే ఆయన ఇప్పటి వరకూ ఈ డేటాను దురుపయోగం చేసిన దాఖలాలు లేవని సిద్ధార్థ్ అంగీకరిస్తూనే ఇలా డేటాబేస్ అందుబాటులో ఉండటం ప్రమాదకరం అని అంటున్నాడు. రవాణా శాఖ వాహన్ డేటాను, డ్రైవింగ్ లైసెన్సుల డేటా బేస్ “సారథి” లోని వివరాలను ప్రతి ఏటా అమ్ముతోందని, తద్వారా రూ. ౩ లక్షలు, విద్యాసంస్థల సమాచారాన్ని 5 లక్షలకు అమ్ముతోందని ఆయన అన్నారు. ఈ సమాచారాన్ని ట్రయాంగులేషన్ పద్ధతి ద్వారా మ్యాచ్ చేసి చూసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

ఈ అంశంపై పరిశోధన చేసిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చర్ కె జె శశిధర్ ఇలా డేటాను అమ్మడం సరైనది కాదని అంటున్నారు. ఈ డేటా ఉండటం వల్ల సెకెండ్ హ్యాండ్ కార్లు కొనేవారికి లాభాలు ఉండవచ్చు కానీ దీనిని పబ్లిక్ చేయడం సరైనది కాదని ఆయన అన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.