వి ఎఫెక్ట్.. బ‌డ్జెట్ కోతా? సినిమా కోతా?

By సుభాష్  Published on  8 Sept 2020 11:22 AM IST
వి ఎఫెక్ట్.. బ‌డ్జెట్ కోతా? సినిమా కోతా?

టాలీవుడ్లో మ‌న‌దైన నేటివిటీతో, తెలుగుద‌నంతో, సృజ‌నాత్మ‌కతో సినిమాలు తీసే ద‌ర్శ‌కుల్లో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఒక‌రు. తొలి సినిమా గ్ర‌హ‌ణంతో మొద‌లుపెడితే.. అష్టాచెమ్మా, అంత‌కుముందు ఆ త‌రువాత , జెంటిల్‌మేన్‌, అమీతుమీ, స‌మ్మోహ‌నం లాంటి మంచి సినిమాలు అందిచాడాయ‌న. ముఖ్యంగా రెండేళ్ల కింద‌ట వ‌చ్చిన స‌మ్మోహ‌నం తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌న‌ప‌రిచింది. స్టార్ కాస్టింగ్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ సినిమా ఓ స్థాయికి మించి విజ‌యం సాధించ‌లేదు కానీ.. స్టార్ హీరో హీరోయిన్లు ఉండుంటే దాని స్థాయి వేరుగా ఉండేదే. స్టార్ల‌ను డీల్ చేయ‌గ‌ల, పెద్ద స్థాయి సినిమాలు చేయ‌గ‌ల స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ చిన్న‌, మీడియం రేంజ్ సినిమాల‌కే ప‌రిమితం అయిపోతున్నాడంటూ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ గురించి ఆ టైంలో అభిమానులు ఫీల‌య్యారు కూడా.

ఐతే ఈసారి సుధీర్‌తో పాటు నానీని కీల‌క పాత్ర‌కు తీసుకుని దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్లో పెద్ద బ‌డ్జెట్లో వి పేరుతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తీశాడు ఇంద్ర‌గంటి. దీని ప్రోమోలు చూసి ఇంద్ర‌గంటి గ‌ట్టిగా కొట్ట‌బోతున్నాడ‌ని.. అత‌డి రేంజ్ మార‌బోతోంద‌ని అంతా ఆశించారు. తీరా చూస్తే ఈ సినిమా అంచ‌నాల్ని అందుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన ఈ చిత్రానికి పూర్తి నెగెటివ్ టాక్ వ‌చ్చింది. రిలీజైంది థియేట‌ర్ల‌లో కాదు కాబ‌ట్టి బాక్సాఫీస్ ఫ‌లితం గురించి బాధ లేదు. కానీ ఈ సినిమా ప్ర‌భావం ఇంద్ర‌గంటి త‌ర్వాతి చిత్రంపై క‌చ్చితంగా ఉంటుంది. వి విడుద‌ల‌కు ముందు ఇంద్ర‌గంటి, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్లో సినిమాఓకే అయింది. దిల్ రాజే నిర్మాత‌. దీనికి భారీ బ‌డ్జెట్ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. అస‌లే క‌రోనా, పైగా వి సినిమాతో ఇంద్ర‌గంటి విమ‌ర్శ‌లెదుర్కొన్నాడు. దీంతో బడ్జెట్ కోత త‌ప్ప‌ద‌ని అంటున్నారు. అంతే కాదు. ఇటు ఇంద్ర‌గంటి పేరు చెడింది. మ‌రోవైపు విజ‌య్ మార్కెట్ కూడా దెబ్బ తింది. ఈ నేప‌థ్యంలో. దిల్ రాజు ఇప్పుడున్న స్థితిలో అస‌లీ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడా లేదా అని కూడా సందేహిస్తున్నారు.

Next Story