అక్కడ అశ్లీల చిత్రాలు చూసేందుకే నెట్‌

By అంజి  Published on  20 Jan 2020 3:13 AM GMT
అక్కడ అశ్లీల చిత్రాలు చూసేందుకే నెట్‌

ఇంటర్నెట్‌తో ఏవో బూతు సినిమాలు చూడటం తప్ప జమ్మూకాశ్మీర్ లో దానితో పెద్దగా పని ఏముంటుంది? అంటూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. విమర్శలు వెల్లువెత్తుతుండటం తో సారస్వత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పారు.

ధీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్‌ కమ్యూనికేషన్‌ స్నాతకోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతతో కశ్మీర్‌లో ఏం మునిగిపోయింది? ఇంటర్నెట్‌తో అక్కడేం చేశారు? ఏవో బూతు సినిమాలు చూడటం తప్ప..’ అని సారస్వత్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలను కశ్మీర్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ తీవ్రంగా ఖండించింది. ఇంటర్నెట్‌ నిలిపివేత వల్ల గత ఆరు నెలల్లో కశ్మీర్‌ లోయలో రూ.18వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేసీసీఐ అధ్యక్షుడు షేక్‌ ఆషిక్‌ పేర్కొన్నారు. సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి కూడా సారస్వత్‌పై మండిపడ్డారు. వివాదం ముదరడంతో అనంతరం కశ్మీరీలకు సారస్వత్‌ క్షమాపణలు చెప్పారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్నారు. ఇలాంటి వక్రీకరణ వల్ల కశ్మీర్‌ ప్రజల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరారు. కశ్మీరీల హక్కులకు, వారికి ఇంటర్నెట్‌ సేవలు కల్పించడానికి తాను వ్యతిరేకం కాదన్నారు.

V K Saraswat

కశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సంఘ వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్నెట్‌ను వాడుతున్నాయని సమాచారం అందడంతో తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

Next Story