అశోక్ తేజతో చిరంజీవి మాట్లాడారు.. వదంతులు నమ్మకండి : ఉత్తేజ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 May 2020 2:56 PM GMTప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యం పాలయ్యారు. గచ్చిబౌలిలోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. ఆపరేషన్ నిమిత్తమై ఆయనకు బి నెగిటివ్ రక్తం అవసరం ఉందని చెబుతున్నారు. ఎవరైనా B నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న రక్త దాతలు ఉంటే గచ్చిబౌలిలోని ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో సంప్రదించవచ్చని.. 8985038016 నంబర్‌ని సంప్రదించి రక్త దాతలు ముందుకు రావాలని సుద్దాల అశోక్ తేజ మిత్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తుండడంతో ఆయనకు బంధువైన సినీ నటుడు ఉత్తేజ్ స్పందించారు. అశోక్ తేజ్ ఆసుపత్రిలో చేరారని... రేపు సాయంత్రం ఆపరేషన్ జరుగుతుందని అన్నారు. మామయ్య గురించి తెలిసి చిరంజీవి గారు ఫోన్ చేశారని, మామయ్యతో మాట్లాడి ధైర్యం చెప్పారని అన్నారు.
వైద్యులు మాట్లాడుతూ, ప్రస్తుతం అశోక్ తేజ పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా బ్లడ్ కొరతగా ఉందని తెలిపారు. సుద్దాల అశోక్ తేజ బ్లడ్ గ్రూపు బి-నెగెటివ్ అని, రక్త దాతల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
సుద్దాల అశోక్ తేజ తెలుగులో ఎన్నో విప్లవ గీతాలను రాశారు. ఠాగూర్ సినిమాలోని 'నేను సైతం' అన్న పాట విన్నా.. భద్రాచలం సినిమాలోని 'ఒకటే జననం.. ఒకటే మరణం' పాట విన్నా.. మనకు సుద్దాల అశోక్ తేజ గుర్తుకు వస్తారు. ఆయన ఎన్నో మంచి మంచి పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయనకు జరిగే ఆపరేషన్ సక్సెస్ కావాలని.. తిరిగి ఆరోగ్యవంతులు అవ్వాలని పలువురు ఆకాంక్షిస్తూ ఉన్నారు.