బస్సును ఢీకొట్టిన లారీ.. 14 మంది దుర్మరణం
By అంజి Published on 13 Feb 2020 8:22 AM IST
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కేడ మృతి చెందారు. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మరో 31 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఆగ్రా-లక్నో హైవేపై వెళ్తున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బస్సు ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తుండగా బుధవారం రాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు రోడ్డు ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.