యూపీ స్కూళ్లో దారుణం.. 81 మందికి కేవలం లీటర్‌ పాలు మాత్రమే..!

By Newsmeter.Network
Published on : 29 Nov 2019 4:21 PM IST

యూపీ స్కూళ్లో దారుణం.. 81 మందికి కేవలం లీటర్‌ పాలు మాత్రమే..!

లక్నో : ప్రభుత్వ పాఠశాలలు అంటేనే చదువుతో పాటు.. మధ్యాహ్న భోజనం కూడా పెడుతారని మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే చాలా మంది నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలలపై ఆశపడుతారు. కానీ.. కేవలం లీటర్‌ పాలలో బకెట్‌ నీళ్లు పోసీ 81 మందికి ఇవ్వడం యూపీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పాలు పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద అల్యూమినియం పాత్రలో వేడి నీళ్లలో లీటరు పాలు కలిపి దాదాపు 81 మంది పిల్లలకు ఇవ్వడాన్ని గమనించారు. ఆ తతంగాన్ని అంతా వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ ఘటనపై స్పందించిన అధికారులు మాత్రం.. తమ వద్ద పాలు పంపిణీ చేయడానికి గేదెలు, ఆవులు లేవని పేర్కొన్నారు. పాల ప్యాకెట్ల సరఫరా ఆలస్యమైన కారణంగానే ఈ తప్పిదం జరిగినట్లు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అదే రోజు మళ్లీ పిల్లలందరికీ సరిపడా పాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే.

Next Story