ఆ ఒక్క నిర్ణయం నా కొంప ముంచింది : ఉతప్ప
By తోట వంశీ కుమార్ Published on 20 May 2020 7:03 PM ISTఒకే ఒక పొరబాటు తన క్రికెట్ కెరీర్‌ను ముంచిందని టీమ్ఇండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఆ నిర్ణయం కారణంగా తన బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిందని తద్వారా టీమ్‌లో చోటు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న ఉతప్ప తాజాగా ఆ జట్టు నిర్వహించిన లైవ్‌లో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
భారత జట్టులో చోటు దక్కినప్పుడు నా లక్ష్యం టెస్టు క్రికెట్ ఆడడమే. అందుకోసం నా బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్చుకున్నా. అయితే.. అది 20-21 ఏళ్ల వయసులో చేసుంటే బాగుండేది. కానీ నేను 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవడం నాకు కీడు తలపెట్టింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన నేను ఆ తరువాత నా బ్యాటింగ్ దూకుడు తగ్గింది. ఫలితంగా జట్టలో కూడా స్థానం కోల్పోయా. అయితే కెరీర్ విషయంలో ఇప్పటికీ పశ్చాత్తాప పడవద్దనుకున్నాని తెలిపాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.
అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం కోసం ప్రవీణ్ అమ్రే పర్యవేక్షణలో నా బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవానలి నిర్ణయించుకున్నా. మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా నిలవాలనుకున్నా.టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే.. గంటల కొద్ది క్రీజులో ఉండి స్థిరంగా రాణించాలని అనుకున్నా.. అయితే ఆ ప్రయత్నం విఫలమైందని అన్నాడు ఉతప్ప.
2006లో భారత జట్టులో చోటు దక్కించుకున్న ఉతప్ప జట్టులో సుస్థిర స్థానాన్ని సాధించలేకపోయారు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉతప్ప సభ్యుడు. 13 ఏళ్ల కెరీర్‌లో ఉతప్ప 46 వన్డేలు, 13టీ20లు మాత్రమే ఆడాడు.
బౌలౌట్ ఘనత ధోనిదే..
2007 టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశలో టీమ్ఇండియా పాకిస్థాన్‌తో తలపడింది. ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. అప్పట్లో బౌలౌట్ విధానం ఉండేది. ఆ టోర్నీతోనే ఐసీసీ ఈ నిబంధనను తీసుకొచ్చింది. భారత జట్టు తరుపున హర్భజన్, సెహ్వాగ్, ఉతప్ప, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్ పేర్లను ప్రకటించగా.. పాకిస్థాన్ తరుపున ఉమర్‌గుల్, సోహైల్ తన్వీర్, ఆరాఫత్, షాహిత్ అఫ్రిధి, ఆసిఫ్‌లను ఎంచుకుంది. తొలి బంతిని సెహ్వాగ్ బౌల్డ్ చేయగా పాక్ బౌలర్ అరాఫత్ మిసయ్యాడు. రెండో బంతిని హర్భజన్‌సింగ్ వేయగా అది కూడా వికెట్లను తాకింది. ఇక ఉమర్‌గుల్ వేసిన రెండో బంతి సైతం వికెట్లను తాకలేదు. రాబిన్ ఊతప్ప మూడో బంతిని బౌల్డ్ చేయగా షాహిద్ అఫ్రిదీ దాన్ని కూడా వృథా చేశాడు. దీంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. అయితే.. భారత్ విజయం సాధించడంలో ధోని పాత్ర ఎంతో ఉందని అన్నాడు ఉతప్ప.
ఎందుకంటే టోర్నీ ఆరంభానికి ముందు ధోని అందరిచేత ‘బౌలౌట్’ ప్రాక్టీస్ చేయించాడని, బౌలౌట్‌కు వెళ్లినప్పుడు వికెట్ల వెనకాల ధోని కీపింగ్ చేసిన విధానం స్పెషల్ అనే చెప్పాలి. పాక్ కీపర్ కమ్రాన్ అక్మల్ రెగ్యులర్‌గా నిలబడగా.. ధోని మాత్రం వికెట్ల వెనుకాల కూర్చున్నాడు. దీంతో మేము ధోనిని టార్గెట్ చేస్తూ స్టంప్స్ పడగొట్టామని, అందుకే ఆ విజయంలో ధోని కే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని ఉతప్ప తెలిపాడు.