టాస్ వేశాడా..? బౌలింగ్ చేశాడా..? నవ్వులు పూయిస్తున్న ఖవాజా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Nov 2019 4:21 PM ISTక్రికెట్‌లో అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆస్ట్రేలియా దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ మార్ష్ కప్ లో కూడా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా-క్వీన్స్‌లాండ్ జట్ల మధ్య పైనల్ పోరు జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ కు ఇరు జట్ల కెప్టెన్లు అయిన ఉస్మాన్ ఖవాజా-టర్నర్‌లు మైదానంలోకి వచ్చారు.
అయితే.. టాస్ వేసేందుకు సిద్దమైన ఖవాజా కాయిన్ అందుకుని టాస్ వేయడానికి సిద్ధమైన క్రమంలో నవ్వులు పూయించాడు. టాస్‌ను ఒక ఎండ్‌లో వేస్తే అది వేరొక ఎండ్‌లో పడింది. టాస్ కాయిన్ అందుకున్న ఖవాజా.. టాస్ వేయమని మ్యాచ్ రిఫరీ చెప్పగానే కాస్త ముందుకు దూకుతూ వెళ్లాడు. ఆ కాయిన్‌ను పైకి గట్టిగా విసరగా అది చాలా దూరంగా పడింది. దాదాపు 10 మీటర్ల దూరంగా వెళ్లింది. రిఫరీ నవ్వుకుంటూ కాయిన్ పడిన చోటకు వెళ్లి వెస్ట్రన్ ఆస్ట్రేలియా టాస్ గెలిచిందని చెప్పాడు.
సాధారణంగా టాస్ వేస్తే కాయిన్ ఇంచుమించు కెప్టెన్లు నిలబడి ఉన్న చోటనే పడుతుంది. ఖవాజా టాస్ వేసిన తీరును వెస్ట్రన్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఖవాజాపై సెటైర్లు పేలుతున్నాయి. టాస్ వేయమంటే.. బౌలింగ్ వేసావేంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.