సెకెండ్ హ్యాండ్ మాస్కులు.. వాడారో ఇక మీ పని గోవిందా..
By తోట వంశీ కుమార్ Published on 15 April 2020 12:37 PM IST
కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే మాస్కులు ధరించాల్సిందే. ప్రస్తుతం మనం ధరించే మాస్కులు మంచివేనా..? లేక ఎవరో వాడిపడేసిన మాస్కులా అనే సందేహాం కలగక మానదు ఈ ఘటన చూస్తే..
డబ్బులను సంపాదించడానికి ఓ ముగ్గురు కలిసి చేసిన పని ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఎన్-95 మాస్కులకు విపరీతమైన గిరాకీ ఉంది.
దీనిని కొందరు క్యాష్ చేసుకోవాలని బావించారు. ఇంకేముంది.. వాడిపాడేసిన ఎన్-95 మాస్కులను తీసకొచ్చి వాటిని ఉతికి ఇస్త్రీ చేసి అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని పాల్ఘర్ పట్టణానికి చెందిన నాగరాజ్ పిల్లా (33), రోహిత్ కొఠారి (30), మహ్మద్ నిగర్ షేక్ (28) లు కరోనా మహమ్మారిని క్యాష్ చేసుకోవాలని భావించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్-95 మాస్కులకు గిరాకీ ఉందని గమనించారు. వారికి ఓ నీచమైన ఆలోచన వచ్చింది. ఆస్పత్రుల నుంచి డంప్ యార్డుల నుంచి వాడిపారేసిన ఎన్-95 మాస్కులను తీసుకొచ్చి ఉతికి ఇస్త్రీ చేసి అనుమానం రాకుండా ఉండేందుకు ప్యాకింగ్ చేసి మరీ విక్రయిస్తున్నారు.
వాడిపాడేసిన మాస్కులను విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఓ ఇంటిలో రైడ్ చేసి 25వేలకు పైగా సెకండ్ హ్యాండ్ ఎన్-95 మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50లక్షలకు పైనే ఉంటుందని అధికారులు అంటున్నారు. వీరిపై 420 (మోసం) మరియు 270 (నిర్లక్ష్యం మరియు ప్రాణాంతక చర్య) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.