భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత ప్రజలు గతంలో కంటే ఇప్పుడు తమను మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారనుకుంటున్నానని చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశలకు ఆయన సమాధాన మిచ్చారు. భారత్‌- పాకిస్తాన్‌ ప్రధానులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, వారు కోరితే కశ్మీర్‌ అంశంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. భారత్‌తో 3 బిలియన్‌ డాలర్ల ఒప్పందం చేసుకున్నామని, భారత్‌కు మరిన్ని ఆయుధాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొనాలనేదే తమ ప్రయత్నమని.. అక్కడ 19 ఏళ్లుగా శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదం పై పోరాడుతున్నామే తప్ప అమాయకుల్ని లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం పై తాను చేసినంత కృషి మరెవరూ చేయలేదని తెలిపారు.

భారత్‌లో అత్యధిక టారీఫ్‌లు..

భారత్‌తో వాణిజ్యం గురించి మాట్లాడుతూ…” భారతీయ మార్కెట్‌ ఎంతో పెద్దది. చాలా విస్తృతమైనది. భారతీయ సీఈఓలతో భేటీ ఆసక్తికరంగా సాగింది. అమెరికాలో పెట్టుబడులో పెట్టేందుకు భారతీయులు ఆసక్తిగా ఉన్నారు. అయితే టారిఫ్‌ల విషయంలో మాత్రం భారత్‌ వైఖరి అలాగే ఉంది. అమెరికాకు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నారు. భారత్‌తో ఒప్పందం అంటే అధిక టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాకు మోటారు సైకిళ్లు పంపినపుడు హార్లేడేవిడ్‌సన్‌ ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో భారత ఎగుమతులకు మాత్రం ఎటువంటి టారిఫ్‌లు విధించడం లేదు” అని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే హెచ్‌-1బీ వీసాల గురించి సంధించిన ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు.

మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకున్నారు..

భారత్‌లో మత స్వేచ్ఛ పరిరక్షణకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని మోదీ కోరుకుంటున్నారనీ.. ఇవాళ్టి మాటామంతిలోనూ మోదీ దాని గురించి ప్రస్తావించారని వెల్లడించారు. గతంలో ఈ దేశంలో 14 కోట్ల మంది ముస్లింలు ఉండేవాళ్లు.. ప్రస్తుతం ఆ సంఖ్య 20 కోట్లకు దాటిందని మోదీ చెప్పారు. ముస్లింకు స్వేఛ్ఛ, రక్షణ ఉందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. భారత్‌ భవిష్యత్తులో ఆర్థికంగా సామాజికంగా మరింత పురోగమిస్తుంది. నైపుణ్యాలు అందిపుచ్చుకునేందుకు భారత యువత ఎంతో కృష్టిచేస్తున్నారని తెలిపారు. భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఈ దేశ అంతర్గతమని.. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) గురించి ప్రధాని మోదీతో తాను చర్చించలేదన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.