షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని ప్రసంగం పేపర్లు చించేశారు.!
By అంజి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ నేత, స్పీకర్ నాన్సీ పెలోసీల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన వార్షిక ప్రసంగం సందర్భంగా నాన్సీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ట్రంప్ నిరాకరించటంతో ఆమె ట్రంప్ ప్రసంగ పత్రాలు చించేయటం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.
సంఘటన వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఎస్‌ఓటీయూ2020 కార్యక్రమం జరుగుతోంది. సభ ట్రంప్ కోసం ఎదురు చూస్తోంది. అప్పుడే ఎంటర్ అయిన ట్రంప్ తన ప్రసంగానికి సంబంధించిన కాపీలను స్పీకర్ పెలోసికి అందించారు. ట్రంప్ తన ప్రసంగ కాపీలను అందిస్తున్న సమయంలో ఆయనకు ఆమె షేక్ హ్యాండ్ అందించారు. అయితే ట్రంప్ చూసి చూడనట్టుగా వెనక్కి తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో తీవ్ర అసహనానికి లోనైన పెలోస్.. ట్రంప్ ప్రసంగ కాపీలను సభలోనే చించేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగ పత్రాలను ఎందుకు చించేశారని నాన్సీని మీడియా ప్రశ్నించగా... ఎందుకంటే ఆయన చేసిన పనికి ప్రత్యామ్నాయంగా ఇదే మర్యాదపూర్వకమైన పని' అని ఆమె సమాధానం చెప్పారు. తాను షేక్ హ్యాండ్ ఇస్తున్న ట్రంప్ నిరాకరిస్తున్నట్లు ఉండే ఒక ఫొటో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన పెలోస్.. ‘‘ప్రజల కోసం పని చేయడానికి డెమొక్రాట్లు ఎవరికైనా స్నేహ హస్తం అందిస్తారు. మాకు సాధ్యమైనంతలో మంచి వాతావరణాన్ని సృష్టించడానికి మేము కృషి చేస్తాము. కానీ ఒక్కోసారి ఆ మైదానంలో మనమే నిలబడలేకపోవచ్చు’’ ట్వీట్ చేశారు.
అయితే ట్రంప్, నాన్సీ మధ్య ఇలాంటి సంఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ప్రత్యర్థి పార్టీ డెమక్రాటిక్ పార్టీకి చెందిన నాన్సి, ఇటీవల ట్రంప్‌పై సెనెట్‌లో అభిశంసన చర్యలను ప్రారంభించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవు. అభిశంసనకు మూల కారణమైన నాన్సీతో గత అక్టోబర్ నుంచి ట్రంప్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఒకరు.. ప్రసంగ పత్రాలు పత్రాలు చించి మరొకరు అసహనం బయటపెట్టుకున్నారు. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఫోన్‌లో ట్రంప్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న సేనేట్ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.