పొలం నుంచే నేరుగా కూరగాయలు కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

By రాణి  Published on  4 March 2020 12:39 PM GMT
పొలం నుంచే నేరుగా కూరగాయలు కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

మీ పంటను మీ డాబా పైనో, పెరట్లోనో పండించుకోవాలని కోరికగా ఉందా? రసాయనాలు, క్రిమి సంహారకాలు వేయకుండా పండించిన కూరగాయలను తినాలని ఉందా? కానీ అంత సమయమూ, స్థలమూ, సౌలభ్యమూ మీకు లేదా? అందుకని మీ కలలు కల్లలైపోతున్నాయా ? సరిగ్గా మీలాంటి వాళ్ల కోసమే మణికొండలో అర్బన్ కిసాన్ అనే సంస్థ వెలిసింది. తక్కువ నేలతో, తక్కువ నీటితో ఆర్గానిక్ పంటలను పండించే సంస్థే అర్బన్ కిసాన్. ఇక్కడ మీరు స్వయంగా వెళ్లి చూసి కావాల్సిన కూరగాయలను చెట్టు నుంచి కోసుకుని తెచ్చుకోవచ్చు. లేదా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. దేశంలోనే అరుదైన అర్బన్ డాబా గార్డెన్స్ ఈ అర్బన్ కిసాన్.

Urban Kissan

“నిజానికి ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్న కూరగాయలు దాదాపు ఆరు రోజుల పాటు 2000 కిమీ ప్రయాణం చేసి మనింటికి వస్తాయి. వీటిపై క్రిమి సంహారకాలు, ఎరువుల తాలూకు రసాయనాలు ఉంటాయి. మనం కూరగాయలను కడిగినప్పుడు ఇవి పారే నీటిలో చేరి, చిన్న చిన్న జంతువులకు, మొక్కలకు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో 45 శాతం పోషక విలువలు అంతరించిపోతాయి. కాబట్టే ఈ సమస్యలేవీ లేని, పోషక విలువలున్న కూరగాయలను వినియోగదారులకు అందించాలన్నదే మా ధ్యేయం” అంటున్నారు అర్బన్ కిసాన్ సీ ఈ ఓ విహారీ కానుకొల్లు.

Urban Kissan 3

“మా ప్రయత్నాల్లో అసలు వ్యర్థాలనేవే ఉండవు. ఈ రోజు అమ్ముడుపోని కూరలు, కాయలు రేపు అమ్ముడు పోవచ్చు. అది పెరుగుతుంది. సూపర్ మార్కెట్ లో పాతబడిన కూరగాయలను చెత్తకుప్పల్లో పారేస్తున్నారు. దీని వల్ల రైతు శ్రమ, వ్యయం - ఈ రెండూ వృథాగా పోతున్నాయి. మా పద్ధతిలో హైడ్రో పోనిక్ విధానంలో నీరు అందిస్తాం. కాబట్టి నీరు వృథాగా పోవడం ఉండదు అంటున్నారు విహారి. “మామూలుగా 1.75 ఎకరాల్లో పండించే పంటను విహారీ కేవలం రెండు వేల గజాల భూమిలో పెంచుతున్నాం. మామూలుగా 200 లీటర్లు నీరు అవసరమయ్యే పొలానికి చాలా తక్కువ నీరు అందిస్తే చాలు,” అంటారాయన. ఈ సంస్థకు స్టోరేజీ ఖర్చు లేదు. రవాణా ఖర్చు లేదు. ఈ సంస్థకు హైడ్రో పోనిక్స్ ను ప్రోత్సహించే వై కాంబినేటర్ అనే సంస్థనుంచి ఆర్ధిక సాయం అందుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో రెండవ ఫార్మ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో మరో నాలుగు ఫార్మ్ లను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది అర్బన్ కిసాన్.

Urban Kissan 4

Next Story