కాలి బొటనవేలుతో చెవి గోక్కునే ఈ పిల్ల ఒలింపిక్స్ గెలుస్తుందా ?

By రాణి  Published on  1 Feb 2020 8:57 AM GMT
కాలి బొటనవేలుతో చెవి గోక్కునే ఈ పిల్ల ఒలింపిక్స్ గెలుస్తుందా ?

ఆశ్చర్యంగా ఉందా? అవును ఆ పన్నెండేళ్ల బుజ్జాయి కాలి బొటనవేలితో చెవి గోక్కుంటుంది. పళ్లతో కాలికి వేసుకున్న సాక్స్ తొలగిస్తుంది. పాములా మెలికలు తిరుగుతుంది. బంతిలా లుంగలు చుట్టుకుంటుంది. ఒంట్లో ఎముకలే లేవా అన్నట్టు విన్యాసాలు చేస్తుంది. ఉపాషా తాలుక్దార్ అనే ఈ అమ్మాయిని అందరూ బోన్ లెస్ వండర్ అంటున్నారు. రిథమ్ జిమ్నాస్టిక్స్ లో పతకాల పంట పండిస్తోంది. ప్రధాని మోదీ ప్రారంభించిన “ఖేలో ఇండియా 2020” యువ క్రీడల్లో రికార్డులను సృష్టిస్తోంది.

తమాషా ఏమిటంటే ఉపాషా తాలుక్దార్ కి కోచ్ లేడు. చిన్నప్పట్నుంచీ అమ్మాయి రకరకాల విన్యాసాలు చేస్తుంటే తండ్రి నికుంజ తాలుక్దార్ ఆమెను అస్సాంలోని గువాహటిలోని తరుణ్ రామ్ ఫుకన్ ఇన్ డోర్ ఆడిటోరియంకు తీసుకువెళ్లాడు. అక్కడ జిమ్నాస్టిక్స్ ను చూసి అలవోకగా చేసేసింది ఉపాష. దానిని చూసి అక్కడి కోచ్ లు “అమ్మాయికి రిథమ్ జిమ్నాస్టిక్స్ నేర్పించండి” అని చెప్పారు. అప్పుడు ఆమెకు ఆరేళ్లు. అప్పటి దాకా నికుంజ తాలుక్దార్ ఆ పేరు వినలేదు. ఆ ఆట ఏమిటో తెలియదు. ఏం చేయాలో తెలియలేదు. ఇంటికి వెళ్లాడు. తరువాత గూగుల్ లో రిథమ్ జిమ్నాస్టిక్స కోసం వెతికాడు. కాలిస్తెనిక్స్, బాలే, డాన్స్, జిమ్నాస్టిక్స్ లను హూప్, బాల్, రిబ్బన్లు, తాళ్ల సాయంతో చేయడమే రిథమ్ జిమ్నాస్టిక్స్. అయితే గువాహటీయే కాదు, మొత్తం అస్సాంలోనే రిథమ్ జిమ్నాస్టిక్స్ కి కోచ్ లేడు. దాంతో ఏం చేయాలో తెలియక, నికుంజ తాలుక్దార్, ఉపాషా తాలుక్దార్ లు యూట్యూబ్ తల్లిని ఆశ్రయించారు.Upasha Talukdar

రిథమ్ జిమ్నాస్టిక్స్ వీడియోలను యూట్యూబ్ లో చూసి చేయడం ప్రారంభించింది ఉపాష. తరువాత ఉపాష ఫేస్ బుక్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ రిథమ్ జిమ్నాస్ట్ లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. వారినుంచి సలహాలను తీసుకుంది. తన విడియోలను పంపించింది. వారి విడియోలను చూసింది. నెమ్మదిగా స్కైప్ లో పాఠాలు నేర్చుకుంది. రష్యన్ రిథమ్ జిమ్నాస్ట్ ఓలిస్యా రష్యన్ భాషలో కోచింగ్ ఇస్తే , ఆమె గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా అస్సామియా భాషలోకి అనువాదం చేసుకుని మాట్లాడింది. అలా నైపుణ్యం సంపాదించింది. ఆ తరువాత పంజాబ్ లో పదిరోజుల పాటు కోర్సు నేర్చుకుంది. తరువాత హర్యాణాలో చదువుకుంది. తరువాత ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ప్రాక్టీస్ చేసింది. ఒక రోజు కార్ పార్కింగ్ లో, ఇంకో రోజు స్టేడియంలో జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసింది. 2020 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో మెడల్స్ గెలుచుకున్న తరువాత ఆమె నైపుణ్యాలను చూసి 1980 లలో ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ గా వెలిగిన కల్పనా దేబనాథ్ ఆమెకు తన ఇంట్లోనే ఉంచుకుని శిక్షణనిచ్చింది. ఇప్పుడు ఏకలవ్య శిష్యురాలు ఉపాషా లక్ష్యం ఒక్కటే .. ఒలింపిక్స్ లో పతకం గెలవడం.

Next Story