యూఎన్‌ఓకు పూర్తి వాటా చెల్లించాం- సయ్యద్ అక్బరుద్దీన్
By న్యూస్‌మీటర్ తెలుగు
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితికి భారత్ తరపున చెల్లించాల్సిన నిధులు చెల్లించామని యూఎన్‌ఓలో శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. యూఎన్‌ఓలో 193 దేశాలంటే..34 దేశాలు మాత్రమే పూర్తి వాటా చెల్లించాయన్నారు. అయితే..నిధులు చెల్లించని వారి పేర్లను యూఎన్‌ఓ ప్రకటించలేదు. ఇరాన్, మెక్సికో బ్రెజిల్, అర్జెంటీనా యూఎన్‌ఓ కు ఎక్కువ నిధులు చెల్లించాల్సి ఉందని సమాచారం. ఇక నిధులు మొత్తం చెల్లించిన దేశాల్లో భారత్ తోపాటు జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్, ఫిన్లాండ్, కెనడా, భూటన్‌లు ఉన్నాయి. అమెరికా కూడా తమ పూర్తి వాటాను అమెరికాకు చెల్లించలేదు.
ఇప్పటికీ యూఎన్‌ఓ 230 మిలియన్ డాలర్ల లోటుతో నడుస్తోంది. అక్టోబర్ చివరి నాటికి యూఎన్‌ఓ ఖజానా ఖాళీ అవుతుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 70శాతం మాత్రమే సభ్య దేశాల నుంచి నిధులు సమకూరాయి. దీంతో ప్రధాన కార్యదర్శి గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
యూఎన్‌ఓ ఖజానాలో నిధులు నిండుకోవడంతో చాలా పొదుపు పాటిస్తున్నారు. చివరకు ఎస్కలేటర్లు, వాటర్ కూలర్లు కూడా ఆపేశారు. దౌత్యకార్యాలయాలను సైతం ఎప్పుడు లేని విధంగా సాయంత్రం 5 గంటలకే మూసేస్తున్నారు. యూఎన్‌ఓకు ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి జీతాలు చెల్లించలేని స్థితిలోకి యూఎన్‌ఓ వెళ్లింది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ యూఎన్‌ఓను ఏర్పాటు చేశారు. యూఎన్‌ఓ పరిస్థితి ఎలా ఉంటే చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతి పరిరక్షణ చర్యలకు కూడా విఘాతం కలుగుతుందని శాంతికాముకులు ఆందోళన చెందుతున్నారు.