హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్ చౌరస్తాలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. సీఎం కేసీఆర్‌కు మేనల్లుడినని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వాహానాల త‌నిఖీల్లో భాగంగా ట్రాపిక్ పోలీసులు ఓ వాహాన దారుడి ఆప‌గా అత‌ని వ‌ద్ద ఎలాంటి ప‌త్రాలు లేవు. ప‌త్రాల‌ను అడ‌గ‌గా పోలీసుల‌తో పై విధంగా మాట్లాడాడు. అక్క‌డే ఉన్న కొంద‌రు వీడియో చిత్రీక‌రించ‌డంతో ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇక ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే… గురువారం ఉదయం నగరంలోని నేరెడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నెరెడ్మెట్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి ఎలాంటి పత్రాలు లేకుండా టీఎస్16యూబీ5620 అనే నంబర్ వాహన నడుపుతూ దొరికాడు. పత్రాలు అడిగితే… తాను ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభకు స్వయానా మేనల్లుడినని దబాయించి చెప్తున్నాడు. ‘‘నేను దొంగని కాదు.. సీఎంకు అల్లుణ్ని. కోర్టులో కేసు వేసినా నేనే గెలుస్తా. కారుకు అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయా అని కోర్టు అడుగుతుంది. చలాన్లు ఉన్నాయా అని విచారణ చేయిస్తుంది.’’ అని పోలీసులతో గట్టిగా మాట్లాడాడు. తలుచుకుంటే ఏమైనా చేస్తానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు. సీఎం మేనల్లుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి కమర్షియల్ వాహనం నడుపుతుండడం గమనార్హం. కమర్షియల్ వాహనం కాబట్టి దీనికి అధికారులు స్టిక్కర్ కేటాయించలేదని సదరు వ్యక్తి పోలీసులకు చెప్పాడు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.