'వశిష్ట'ను బయటకు తీయడానికి విశ్వప్రయత్నం..ఇంకా బోటులోనే 12 మృతదేహాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 5:38 AM GMT
వశిష్టను బయటకు తీయడానికి విశ్వప్రయత్నం..ఇంకా బోటులోనే 12 మృతదేహాలు..!

తూర్పుగోదావరి: కచ్చులూరు వద్ద గోదావరి నదిలో నెల రోజుల కిందట మునిగిపోయిన వశిష్ట రాయల్ బోటును బయటకు తీసే ప్రయత్నం కొంతవరకు ఫలించింది. సోమవారం బోటుకు సంబంధించిన కొంత భాగాన్ని ఒడ్డుకు లాగారు. వెలికితీత ప్రయత్నంలో బోటు పైకప్పు విడిపోయి బయటకు వచ్చింది. బోటు మిగతా భాగాన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా గోదావరిలో నీటిమట్టం తగ్గడంతో వెలికితీత ప్రయత్నాలకు అనుకూలించింది. ప్రస్తుతం బోటు ఉన్న చోట నీటి మట్టం సుమారు 40 అడుగులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం ఓం శివశక్తి అండర్‌వాటర్ సర్వీసెస్‌కు చెందిన ఇద్దరు డైవర్లు ఆదివారం ఉదయం నదిలో మునిగి బోటుకు భారీ తాళ్లు కట్టడంతో బోటు పైభాగం కొంత బయటకు లాగగలిగారు. బోటులో ఇసుక, మట్టి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో ఒకేసారి రాలేదని, పైభాగం ఊడి వచ్చిందని ధర్మాడి సత్యం తెలిపారు.

సెప్టెంబ‌ర్ 15న పాపికొండ‌ల ప‌ర్య‌ట‌నకు 77 మంది యాత్రికుల‌తో బ‌య‌లుదేరిన బోటు క‌చ్చులూరు మందం స‌మీపంలో ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో 26 మందిని స్థానికులు సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చ‌గ‌లిగారు. మిగిలిన వారు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కూ 12 మంది ఆచూకీ ల‌భించ‌లేదు. మృత‌దేహాలు బోటు అడుగున ఇరుక్కుని ఉంటాయ‌ని అంచ‌నా వేశారు. బోటును వెలికితీయ‌డంతో పాటుగా మృత‌దేహాల కోసం సెప్టెంబ‌ర్ 28న ఆప‌రేష‌న్ ప్రారంభ‌మైంది. కాకినాడ‌కు చెందిన బాలాజీ మెరైన్ సంస్థ‌కు 22.7ల‌క్ష‌ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ధ‌ర్మాడి స‌త్యం బృందం ఈ ప‌నులు చేప‌ట్టింది. తొలుత ఐదు రోజుల పాటు సాగించిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అదే స‌మ‌యంలో గోదావ‌రికి వ‌ర‌ద పోటెత్త‌డంతో అక్టోబ‌ర్ 3న ఆప‌రేష‌న్ నిలిపివేశారు.

గోదావ‌రి శాంతించ‌డంతో అక్టోబ‌ర్ 16 నుంచి మ‌రోసారి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. తొలుత ధ‌ర్మాడి స‌త్యం బృందం చేసిన ప్ర‌య‌త్నాల ప్ర‌కారం లంగ‌రుకి బోటు త‌గ‌ల‌డంతో ఒడ్డుకి చేరుతుంద‌ని ఊహించిన‌ప్ప‌టికీ అది నెర‌వేర‌లేదు. దాంతో ప్లాన్ మార్చారు. విశాఖ నుంచి డైవ‌ర్లను రంగంలో దింపారు. చివ‌ర‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బోటులో కొన్ని భాగాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బోటు మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఆశించామ‌ని, కానీ ప్ర‌య‌త్నాలు పూర్తిగా స‌ఫ‌లం కాలేద‌ని ధ‌ర్మాడి స‌త్యం తెలిపారు. అయినా ఆప‌రేష‌న్ సాగిస్తామ‌ని, బోటుని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒడ్డుకి చేరుస్తామ‌ని ఆయ‌న అంటున్నారు.

గ‌త వారం చేసిన ప్ర‌య‌త్నాల్లో రెయిలింగ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు బోటు పై భాగంలోని కొంత వ‌చ్చింది. దాంతో మ‌రోసారి డైవ‌ర్స్ నీటిలో దిగారు. ఈసారి మ‌రింత బ‌ల‌మైన తాళ్లు క‌ట్టి లాగాల‌ని భావిస్తున్న‌ట్టు ఆప‌రేష‌న్ లో పాల్గొంటున్న వారు చెబుతున్నారు. మిగిలిన బాగాన్ని తీసెందుకు రేపు కూడా ఆపరేషన్ కోనసాగుతుంది బోటు బయటకు వస్తూందా లేక ఇసుక మట్టితో కురుకుని ఉండిపోవటం వలన సత్యం బృందం ఏవిదమైన ప్రయత్నలు చేస్తారో వేచి చూడాలి.

Next Story
Share it