ఇప్పటికే వణుకుతున్న అగ్రరాజ్యం.. ఇక ఆయన మాటలు విన్నాక..!

By అంజి  Published on  30 March 2020 11:14 AM GMT
ఇప్పటికే వణుకుతున్న అగ్రరాజ్యం.. ఇక ఆయన మాటలు విన్నాక..!

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా ప్రభావం ఎంతో తీవ్రరూపం దాల్చింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడమే కాకుండా.. వైరస్ బాధితుల సంఖ్య రోజు.. రోజుకీ పెరిగిపోతూ ఉంది. ట్రంప్ ప్రభుత్వం కరోనా వైరస్ ను అంచనా వేయకపోవడమే ఈ స్థాయిలో వైరస్ బాధితుల సంఖ్య పెరగడానికి కారణమని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

అగ్రరాజ్యం అమెరికాలో 142356 కేసులు నమోదవ్వగా చనిపోయిన వారి శాతం 1.74 మాత్రమే.. ఇక అమెరికాలోని కరోనా బాధితుల్లో రికవరీ శాతం చాలా తక్కువ ఉంది. ప్రపంచ పెద్దన్నను ముఖ్యంగా కలవరపెడుతూ ఉన్న అంశం ఇదే.. అమెరికాలో వైరస్ సోకిన వారిలో రికవరీ కేవలం 3.3 శాతం మాత్రమే ఉంది.

ఇటువంటి ఆపత్కాల సమయంలో ఆ దేశ అలర్జీ, అంటు వ్యాధుల జాతీయ సంస్థ డైరెక్టర్ అయిన ఆంథోనీ ఫాసి తమ దేశ భవిష్యత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 100,000 మందికి పైగా కరోనా వైరస్ కారణంగా అమెరికాలో చనిపోయే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే అక్కడ 2000 మందికి పైగా మరణించారు. కొన్ని కొన్ని సార్లు మనం ఊహించిన దానికంటే పెద్ద నష్టమే జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ టీమ్ లో డాక్టర్ ఆంటోనీ ఫాసీ కూడా ఒకరు. ఆయన మాట్లాడుతూ చనిపోయే వారి సంఖ్య 100 నుండి 200000 మంది వరకూ ఉండవచ్చని.. అమెరికాలో రాబోయే కాలంలో ఒక మిలియన్ కరోనా వైరస్ కేసులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు కలిగిన దేశంగా గత శనివారం నాడు అమెరికా ఎగబాకింది. ఆదివారం రాత్రి వరకు అమెరికాలో లక్షా 40 వేల మందికి వైరస్ సోకింది. ఇప్పటికే 2400 మందికి పైగా మరణించారు.

ఆదివారం నాడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. తాము వైరస్ కట్టడికి పలు మోడల్స్ ను అవసరిస్తూ ఉన్నామని అన్నారు. కానీ అనుకోని కారణాల వలన కరోనా వైరస్ కారణంగా చనిపోయే వారి సంఖ్య 100000 నుండి 200000 మధ్య ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. దేశవ్యాప్తంగా సోషల్ డిస్టెన్సింగ్ ఆంక్షలను ఇంకో 30రోజుల పాటూ అమలు చేయబోతున్నామని ఆయన అన్నారు. కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షలను ఏప్రిల్ చివరి వరకు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలంతా సామాజిక దూరం పాటించాల్సిందేనని అన్నారు.

న్యూయార్క్ లో కరోనా విలయం..

ఆంటోనీ ఫాసీ మరికొందరు నిపుణులు.. పరిస్థితులు మెరుగవ్వడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న కేసుల కారణంగా ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు అందించలేకపోతున్నామని అన్నారు. ముఖ్యంగా న్యూయార్క్ లో కరోనా సమస్య అధికారులను కలవరపెడుతోంది. న్యూయార్క్ రాష్ట్రంలోనే కరోనా వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నారని అక్కడి రికార్డులు చెబుతున్నాయి. మరో రెండు వారాలు ఇదే స్థాయిలో కరోనా బాధితుల సంఖ్య పెరిగితే పలు ఆసుపత్రులు 'అవుట్ ఆఫ్ బెడ్స్' అంటూ చేతులెత్తేసిన పరిస్థితి అక్కడి రాష్ట్రాల్లో నెలకొంది. రానున్న వారంలో వెంటిలేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని వందల వెంటిలేటర్ల అవసరం ఉందని.. వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.

Also Read: మా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది.. 20 రెట్లు ఎక్కువగా చనిపోయారు..!

ఇప్పటికే అమెరికా లోని పలు రాష్ట్రాలు, నగరాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. 215 మిలియన్ల అమెరికన్లు ఇళ్లకే పరిమితం అయ్యారు.

Next Story