ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందనుకోకండి..ప్రాణాలు పోతాయ్

By రాణి  Published on  20 March 2020 1:39 PM GMT
ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందనుకోకండి..ప్రాణాలు పోతాయ్

ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న కరోనాను ఇప్పుడు కట్టడి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే..రాబోయే రోజుల్లో లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదముందని హెచ్చరించారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. కంటికి కనిపించని కార్చిచ్చులా కరోనా వ్యాపిస్తుందని..రోజుకి వేలమంది కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కరోనా మనల్ని ఏం చేస్తుందిలో అని నిర్లక్ష్యం చేస్తే..పరిస్థితి చేయి దాటిపోతుందన్నారు. ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నవారికి సంఘీభావం తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వివిధ దేశాలన్నీ కలిసి కరోనాను కట్టడి చేసే దిశగా కృషి చేయాలని సూచించారు.

Also Read : రాజ్ భవన్ లోనూ జనతా కర్ఫ్యూ : గవర్నర్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 10 వేల మందికి పైగా కరోనా బాధితులు మరణించడంపై ఐరాస తీవ్ర అసహనం చెందింది. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా ఆరోగ్యపరిస్థితులు దిగజారిపోయాయని, ఆందోళనతోనే కొంత రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారని అభిప్రాయపడింది. వెంటనే కరోనా బారి నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సి ఉందన్న విషయాన్ని నొక్కి చెప్పింది. అలాగే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం లేని దేశాలకు కూడా మిగతా దేశాలు ధైర్యం చెప్పి ఆదుకోవాలని ఐరాస సూచించింది. అలాగే ఆర్థిక బలం ఉన్న దేశాలు తమదేశ పౌరుల రక్షణే కాకుండా ఇతర దేశాలకు సాయం చేయాలని కోరింది. త్వరలోనే వైరస్ మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదం కూడా ఉందని ఐరాస హెచ్చరించింది. ఇప్పుడు సహాయం చేయకపోతే విపత్తు సమయంలో దారుణమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Also Read : బాలీవుడ్ సింగర్ కు కరోనా..సెల్ఫ్ క్వారంటైన్ లో మాజీ ముఖ్యమంత్రి

అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన అన్ని జాగ్రత్త చర్యలను అంతా పాటించాలని కోరింది. ప్రపంచ వ్యాప్తంగా కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలపై కూడా దృష్టి సారించాలని, అల్పాదాయం ఉన్నవారిని, చిన్న, మధ్య తరహా వ్యాపారులను కూడా ఆయా దేశాల ప్రభుత్వాలు, సంబంధిత కంపెనీల యాజమాన్యాలు ఆదుకోవాలని ఐరాస పిలుపునిచ్చింది. ఆర్థిక ఇబ్బందులున్న దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంక్, ఐఎమ్ఎఫ్ తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా కీలకపాత్ర పోషించాలని పేర్కొంది. ఆయా దేశాల మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి ఒకరికొకరు సాయం చేసుకుంటూ వైరస్ ను తరిమికొట్టాలని సూచించారు.

Next Story