గల్ఫ్ లో గందరగోళం...ఇండియాలో అయోమయం

By రాణి  Published on  6 Jan 2020 7:35 AM GMT
గల్ఫ్ లో గందరగోళం...ఇండియాలో అయోమయం

గల్ఫ్ లో గందరగోళం, అమెరికా ఇరాన్ లలో యుద్ధ వాతావరణం వల్ల ఎక్కువగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు ప్రభావితమౌతాయని, వీటి వలన భారతదేశంలో తీవ్రమైన ప్రభావం ఉండబోతోందని కేంద్ర చమురు పెట్రోలియం ఉత్పత్తుల మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఆందోళన వెలిబుచ్చారు. స్థానిక చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

మన దేశంలో మొత్తం ఇంధన అవసరాలు 30 శాతం చమురుతో, 6 శాతం గ్యాస్ తో తీరతాయి. భారత దేశం తన అవసరాల నిమిత్తం 86 శాతం చమురును విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంది. చమురు కొనుగోలుదారుల్లో ప్రపంచంలో మనది మూడో స్థానం. వీటన్నిటి వల్ల గల్ఫ్ లో జరిగే ఏ చిన్న పరిణామమైనా భారత్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పైగా మనకు కావలసిన చమురు, సహజవాయువుల్లో మూడింట రెండు వంతులు ఇరాన్, ఒమాన్ ల మధ్య ఉన్న సముద్ర మార్గం గుండానే వస్తుంది. దీంతో అంతర్జాతీయ చమురు ధరల వల్ల మన ప్రజలపై ప్రభావం పడుతుంది. ధరలు పెరుగుతాయి. అక్కడి చమురు పంపులపై పడే దెబ్బలు మన పెట్రోలు పంపులపై వాతలు తేలతాయి. మన ఇంటి బడ్జెట్లు తారుమారైపోతాయి. ఇక ప్రభుత్వంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎక్కువ ధర చెల్లించి పెట్రోలును పొందాల్సి రావడంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల కేటాయింపులు ప్రభావితమౌతాయి. పరిశ్రమలలోనూ వ్యయం మరింత పెరుగుతుంది. డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో రూపాయి మీద ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నిటి వల్ల మార్కెట్ కుదేలవుతుంది. మాంద్యం ముప్పిరికొంటుంది. టీ వంటి ఉత్పాదనలు ప్రధానంగా ఇరాన్ కు ఎగుమతి అవుతాయి. అక్కడ సంక్షోభం వల్ల ఈ ఎగుమతులు ప్రభావితం అవుతాయి.

పెట్రోలు ధర అంతర్జాతీయంగా పది డాలర్లు పెరిగితే మన స్థూలదేశీయోత్పత్తిలో 30 బేసిస్ పాయింట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం స్థానిక ఉత్పాదనను పెంచి, ఇతర మాధ్యమాల ద్వారా విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2022 నాటికి 120 గిగా వాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.

Next Story