వైఎస్ జగన్‌పై కేంద్రం కేసుల పంజా విసరబోతుందా? ఉండవల్లి మాటల్లో అర్ధం ఏంటీ..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 7:00 PM GMT
వైఎస్ జగన్‌పై కేంద్రం కేసుల పంజా విసరబోతుందా? ఉండవల్లి మాటల్లో అర్ధం ఏంటీ..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌. ఆయన మాటల మరాఠి. కాలికేస్తే మెడకేస్తాడు..మెడకేస్తే కాలికేస్తాడు. ఆయనతో చర్చల్లో కూర్చోవడం కష్టం. పక్కా లెక్కలతో వస్తాడు. అటువంటి ఉండవల్లి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

వైఎస్ఆర్ కుమారుడిగా జగన్‌పై అభిమానం ఉందని చెబుతూనే..ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ పాలన ఎలా ఉందని అడిగారు. వచ్చి ఐదు నెలలేగా అయింది అంటూనే...జగన్‌ పాలనపై తన అభిప్రాయం మాత్రం చెప్పలేదు. కాని..జగన్ కేసులు గురించి ప్రస్తావించారు. ఉండవల్లి నోట్లోంచి వైఎస్ జగన్‌పై కేసులు అనే పదం వచ్చిందంటే ఆలోచించాల్సిందే.

అంతేకాదు..జగన్‌ మళ్లీ జైలుకు వెళ్తాడేమో అనే విధంగా మాట్లాడారు.

జగన్ కేసులపై ఏం జరుగుతుంది..మీ అభిప్రాయం ఏంటని ఉండవల్లిని ప్రశ్నించగా... జగన్‌కు కష్టకాలం ఉందన్నారు. శశి కళ విషయంలో ఏం జరిగిందో తెలుసు కదా..ఆమె జైలుకు ఎలా వెళ్లిందో చూశాం కదా అన్నారు. ఆమె వెంట మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా ..సుప్రీం కోర్ట్ కేసును ముందు పెట్టి అప్పటికప్పుడు ఆమెను జైల్లో పెట్టారని.. ఇది మోడీ, అమిత్ షా చెయ్యగలిగిందేనన్నారు. మోడీ, అమిత్ షా తలుచుకుంటే ఏమైనా జరుగుతుందని ఈ దేశం కోసమే మేము పుట్టాం అని వారు అనుకుంటూ ఉంటారన్నారు ఉండవల్లి.

కేసుల విషయంలో మొన్న వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటీషన్ పై సిబిఐ వేసిన అఫిడవిట్ చూస్తేనే.. ఏమి జరుగుతుందో అర్ధం అవుతుందన్నారు ఉండవల్లి. ఆ అఫిడవిట్ లో సిబిఐ వాడిన భాష చూస్తే.. విషయం తెలిసిపోతుందని, జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అనే చెప్పిన మాట చాలా పవర్ ఫుల్ అన్నారు. ఇప్పటికిప్పుడు బెయిల్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. ఆ అఫిడవిట్ చదివితేనే సిబిఐ అమిత్ షా కంట్రోల్ లో ఉన్న సంస్థని తెలిసిపోయిందని ఉండవల్లి చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవచ్చేమో..?!

ఇక అదే విధంగా తెలుగుదేశం పార్టీ పై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. 151 సీట్లు జగన్ కు వచ్చినా వైఎస్ఆర్ సీపీ అనేది లేదనే అనుకుంటానన్నారు ఉండవల్లి. ఆ గెలుపు కేవలం జగన్, వైఎస్ఆర్ ఇమేజ్ వల్ల వచ్చిందన్నారు. వైఎస్ఆర్ సీపీ వల్ల గెలవేలదన్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, పార్టీ పరంగా, టిడిపి ఎప్పటికీ బలంగానే ఉంటుందని చెప్పారు. 23 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు వచ్చిన విషయం మర్చిపో కూడదన్నారు. 2004లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ..కాని అనూహ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోకూడదని తెలిపారు. వైఎస్ఆర్‌ సీనీ ఇంకా గ్రామస్థాయిలో బలపడలేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయన్నారు. జగన్ గెలవడం తనకు వ్యక్తిగతంగా ఆనందమే అని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పటికీ స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయన్నారు ఉండవల్లి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే ఉండవల్లి జగన్ పై అభిమానంతో డైరెక్ట్ గా చెప్పటం లేదని, గ్రౌండ్ లెవల్లో వైఎస్ జగన్‌పై వ్యతిరేకత ఎంతలా ఉందో గ్రహించే ఉండవల్లి ఆ మాటలు అన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక..కేంద్రం విషయంలో కూడా జగన్ జాగ్రత్తగా ఉండాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు. కాని..కేంద్రం మాత్రం వైఎస్ జగన్ ను దూరం చేసుకోదని..చంద్రబాబు కంటే జగన్ నమ్మకమైన వ్యక్తి అని రాజకీయ మేధావులు అంటున్నారు.

  • వై. వి. రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story