ఏకగ్రీవాలనూ రద్దు చేయాలి.. లేకుంటే.. – పవన్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కళాశాలలు, సినిమా థియేటర్లు, పబ్‌లు, మాల్స్‌, పార్కులు మూసివేస్తూ నిర్ణయించారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్  ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ఎన్నికలను వాయిదా వేయటమే కాదు.. నామినేషన్లు, ఏకగ్రీవాలను రద్దు చేయాలంటూ కొత్త డిమాండ్‌ తెరపైకి తెచ్చారు. భయానక వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగిందని, భయపెట్టి నామినేషన్లు  ఉపసంహరించుకొనేలా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని, వైసీపీ నేతల దాడులకు సంబంధించి వీడియోలు, ఆడియోలు అమిత్‌షాకు అందజేస్తానంటూ ప్రకటించారు. తప్పులు చేసిన అధికారులపైనా కేంద్రానికి నివేదికను పంపిస్తానని, కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని తెలిపారు.

ఇదిలా ఉంటే ఎన్నికల వాయిదాపై టీడీపీ నేతలు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాయిదా ఎంతమాత్రం కారణం కాదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికలు వాయిదా కాదు.. ఏకంగా రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరిగి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు కూడా ఈసీ ప్రకటనపై స్పందించారు. ఎన్నికల తాత్కాలిక నిలిపివేతను ఆహ్వానిస్తున్నామని, వాయిదా వేయడమే కాకుండా మొత్తం ప్రక్రియను మొదటి నుంచి చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *