ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం
By తోట వంశీ కుమార్ Published on 28 April 2020 11:07 AM ISTపాకిస్థాన్ ఆటగాడు ఉమర్ అక్మల్ పై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మూడేళ్ల నిషేదం విదించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు ముందు బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని తెలుపనందుకు అక్మల్ పై పీసీబీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఈ నిషేదం కారణంగా అక్మల్ మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ ఆడకుండా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మిరాన్ చౌహాన్ నిషేదం విధించినట్లు పేర్కొంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అక్మల్ క్వెటా గ్లాడియేటర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు ముందు కొందరు బుకీలు.. అక్మల్‌ను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం అందుకున్న పీసీబీ అవినిరోధక విభాగం అధికారులు తొలి మ్యాచ్‌కు ముందే అక్మల్ ను టోర్నీలో ఆడకుండా అడ్డుకున్నారు. అనంతరం రెండు నెలల పాటు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారు. ఈ విచారణలో అక్మల్ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో.. సోమవారం శిక్షను ఖరారు చేసినట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
పాక్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్‌కు 29 ఏళ్ల ఉమర్ అక్మల్ సొంత సోదరుడు. అంతేకాదు.. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజామ్‌కు కూడా వరుసకు సోదరుడు అవుతాడు. 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20ల్లో పాకిస్థాన్ తరుపున ఉమర్ అక్మల్ ఆడాడు.