క్షమించండి.. ఉక్రెయిన్ విమానాన్ని మేమే కూల్చేశాం..!
By సుభాష్ Published on 11 Jan 2020 2:44 PM ISTముఖ్యాంశాలు
తప్పును ఒప్పుకొన్న ఇరాన్
ఉద్దేశపూర్వకంగా కూల్చలేదన్న ఇరాన్
పొరపాటున కూల్చినందుకు క్షమాపణలు
ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానాన్ని మేమే కూల్చివేశామని ఇరాన్ స్పష్టం చేసింది. కానీ విమానాన్ని కావాలని కూల్చివేయలేదని, పొరపాటున అది జరిగిందని చెప్పుకొచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఓ విమానం కుప్పలికూలిన సంగతి తెలిసిందే. ఒక వైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో విమానం కుప్పకూలడం మరింత ఆందోళనకు గురిచేసింది. బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 176 మంది ప్రయాణికులు మృతి చెందారు. అయితే ముందుగా ఆ విమానాన్ని కూల్చివేయలేదని ప్రకటించిన ఇరాన్.. ఇప్పుడు తన తప్పును అంగీకరించింది. ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ విమానాన్ని కూల్చి వేయలేదని చెప్పుకొచ్చింది. అది మానవ తప్పిదం కారణంగా విమానం కూల్చివేసినట్లు ఇరాన్ టీవీ ప్రకటించింది.
మిలటరీ యూనిట్‌కు సమీపంగా వెళ్తున్న కారణంగా అనుకోకుండా ఆ విమానాన్ని మిస్సైల్‌తో పేల్చివేసినట్లు ఇరాన్ సైనిక విచారణలో స్పష్టమైంది. ఇక అమెరికా చేసిన దాడి వల్ల ఈ తప్పిదం జరిగిందని, దాని వల్లే విమానం కూల్చివేయడం జరిగిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జాదవ్ జారిఫ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ పేర్కొంది.
మృతుల కుటుంబాలకు సంతాపం
విమాన ప్రమాదంలోమరణించిన మృతుల కుటుంబాలకు ఇరాన్ మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలకు, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమానీ ఖాసీంను అమెరికా హత్య చేసిన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడింది. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ముందు చెప్పినట్లుగానే ఇరాన్ అన్నంత పని చేసి. 22 క్షపణులతో ఇరాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడులు జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఉక్రెయిన్ కు చెందిన విమానం కుప్పకూలింది. టెహ్రాన్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ముక్కలు ముక్కలు అయి 179 మంది ప్రాణాలను బలితీసుకుంది. విమానం గాలిలో ఉన్నప్పుడు మంటలు అంటుకున్నాయని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ విమానాన్ని ఏ క్షిపణి కూడా కూల్చలేదని ముందుగా ఇరాన్ బుకాయించింది. కానీ అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావడంతో మేమే కూల్చివేశామని చెప్పేసింది ఇరాన్.
సీరియస్‌గా తీసుకున్న కెనడా
ఈ ఘటనను కెనడా దేశం కూడా సీరియస్‌గా తీసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది కెనడా దేశానికి చెందిన వారేనని, ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కోరింది. విమానాన్ని క్షిపణులతోనే ఇరాన్ కూల్చివేసిందని కెనడా ప్రకటించింది. ఈ ప్రమాదంపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. చివరకు ఇరాన్ తన తప్పును ఒప్పుకొంది.