భారత సుప్రీంకోర్టులో వాదనలు విన్న బ్రిటన్ చీఫ్ జస్టిస్
By అంజి
ఢిల్లీ: భారత సుప్రీంకోర్టులో యునైటెడ్ కింగ్‌డమ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాదనలు విన్నారు. అదేంటీ.. మన సుప్రీంకోర్టులో వేరే దేశానికి చెందిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాదనలు వినడం ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే.
ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బ్రిటన్ చీఫ్ జస్టిస్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్.. సోమవారం భారత సుప్రీంకోర్టుకు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరుగుతున్నాయో ఆయన గమనించారు. సుప్రీంకోర్టుకు వచ్చిన ఆయనకు అటార్నీ జనరల్ కే.కే.వేణుగోపాల్ స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే పక్కనే జిస్టిస్ జాన్ రీడ్ కూర్చుకున్నారు. ఇద్దరు కలిసి ఓ మధ్యవర్తిత్వ ఒప్పందంలో తలెత్తిన వివాదానికి సంబంధించిన కేసులో వాదనలు విన్నారు. జస్టిస్ జాన్ రీడ్ 2020 జనవరి 11న యునైటెడ్ కింగ్‌డమ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు.
లింగపరమైన న్యాయంపై భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘనమని రాష్ట్రపతి రామ్‌నాథ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ-మారుతున్న ప్రపంచం అంశంపై రాష్ట్రపతి ప్రసంగం కొనసాగింది. సుప్రీంకోర్టు ఎల్లప్పూడు సానుకూల దృక్పథంతోనే పని చేసిందని అన్నారు. పర్యావరణ సమస్యలకు అంతర్జాతీయ చట్టాలు అవసరమన్న భారత చీఫ్ జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.