ఆఫ్రికాలో తెలుగు మెరుపులు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Sep 2019 5:18 AM GMT- కంపాలలో తెలుగువారి ఆత్మీయసమ్మేళనం
- హాజరైన తెలుగు రాష్ట్రాల స్పీకర్లు పోచారం, తమ్మినేని
- ఎక్కడున్నా తెలుగువారందరం ఒక్కటేనన్న పోచారం
- తెలుగువారి మధ్య విభేదాలు పెట్టాలనుకున్నవారికి ప్రజలు బుద్ధిచెప్పారు
- ఉత్సాహవంతులైన పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో రండి
కంపాల, ఉగాండా: ఉగాండా తెలుగు NRI అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ హాజరయ్యారు. 64 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి స్పీకర్లు కంపాల వెళ్లిన విషయం తెలిసిందే.
తెలుగు వారం ఎక్కడ ఉన్నా అందరం ఒక్కటేనన్నారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా మన ఆత్మీయ సంబంధాలు విడిపోలేదన్నారు. "అన్నదమ్ములుగా విడిపోదాం ..ఆత్మీయులుగా కలిసి ఉందామని" ఉద్యమ సమయంలోనే స్పష్టం చేశామన్నారు.
గత 5 ఏళ్లుగా సామరస్యంగా ఉంటున్నామన్నారు పోచారం. శాంతిభద్రతల సమస్యే లేదన్నారు. కొంత మంది తారతమ్యాలు తేవాలని ప్రయత్నం చేశారని.. కాని వారి ఆటలు సాగలేదన్నారు పోచారం శ్రీనివాస రెడ్డి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్పీకర్లం కలిసి వచ్చామన్నారు పోచారం. ఇలా కలిసి వచ్చి తెలుగువారమంతా ఒక్కటే అనే సందేశాన్ని ఇస్తున్నామన్నారు. ప్రపంచంలో ఏ మూల చూసినా తెలుగు వారు ఉన్నారని చెప్పారు. తమ శక్తి, సామర్ధ్యాలతో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు.
విభేదాలు పెట్టాలనుకున్నవారు ఓడారు..!
ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలనుకునే ప్రభుత్వాలు పోయాయన్నారు. ఇప్పుడు కలిసి మాట్లాడుకుందాం.. విభేదాలు పరిష్కరించుకుందాం అనే రీతిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తున్నారన్నారు పోచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మించుకున్నామన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కరవు ఉండదన్నారు పోచారం. తెలంగాణ, కోస్తాంధ్రకే కాదు..నిత్యం కరవుతో అల్లాడే రాయలసీమ, ఉత్తరాంధ్ర కోసం గోదావరి మిగులు జలాలను కృష్ణకు తరలించడానికి కృషి జరుగుతుందన్నారు పోచారం.
ఎన్ఆర్ఐలూ పెట్టుబడులతో రండి
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. విదేశాలలోని NRI లు తమ స్వంత రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నాం. మంచి ఆతిథ్యం, ఆప్యాయతతో ఆదరించిన తెలుగువారికి కృతజ్ఞతలు అంటూ పోచారం తన ప్రసంగాన్ని ముగించారు.