Ugadi 2023: శోభకృత్ అంటే ఏమిటి? ఈ ఏడాది ఏం చేయాలి?
ఉగాదిని యుగాది అని కూడా అంటాం. ఉగాది పండుగ తెలుగు వారి కొత్త సంవత్సరం మొదటి రోజు.
By అంజి Published on 20 March 2023 2:45 PM IST
Ugadi 2023: శోభకృత్ అంటే ఏమిటి? ఈ ఏడాది ఏం చేయాలి?
ఉగాదిని యుగాది అని కూడా అంటాం. ఉగాది పండుగ తెలుగు వారి కొత్త సంవత్సరం మొదటి రోజు. హిందూ పంచాంగ ప్రకారం.. మార్చి 21న అంటే ఫాల్గుణ మాసం చివరి రోజున శుభకృత నామ సంవత్సరం ముగుస్తుంది. ఆ తర్వాత రోజు.. అంటే మార్చి 22వ తేదీన తెలుగు సంవత్సరంలోని మొదటి నెల.. చైత్ర మాసం ప్రారంభం అవుతుంది. చైత్ర మాసం ప్రారంభమయ్యే మొదటి రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. ఆరోజు నుంచే 'శోభకృతు నామ సంవత్సరం' ప్రారంభం అవుతుంది. శ్రీ శోభకృత నామ సంవత్సరంలో మార్చి 22, 2023న బుధవారం రోజు ఉగాది పండుగను జరుపుకుంటున్నాం.
శోభకృత్ అంటే ఏమిటి?
తెలుగు కాలగమనంలో 60 సంవత్సరాలు ఉంటాయి. అలా 60 సంవత్సరాలకు.. ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ సారి వచ్చిన కొత్త సంవత్సరం పేరు శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాది. ఇది మార్చి 22, 2023 బుధవారం చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి రోజున వస్తుంది. శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్థము. శోభకృత్ సంవత్సరము జీవితాలలో వెలుగును నింపుతుంది. ఉద్యానవనాలన్నీ పూలశోభతో కళకళలాడుతూ ఉండేటటువంటి సంవత్సరమే శ్రీశోభకృత్ నామ సంవత్సరం.
ఉగాది పండుగ రోజు సూర్యాదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలంటు స్నానం చేసిన తర్వాత కొత్త దుస్తులు ధరించాలి. ఆ తర్వాత ఇంటిని పూలతో, మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పండుగ రోజున ఇంట్లో మీకిష్టమైన దేవుడిని పూజంచాలి. వీలైతే దగ్గర్లోని ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం మంచిది. ఇంట్లో దేవుడికి పూజలు చేసిన తర్వాత ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేయాలి. ఆ తర్వాతే ఇంటిల్లిపాది ఉగాది పచ్చడిని తాగాలి. పండుగ రోజు పెద్దవారి ఆశీస్సులు పొందాలి.
ఉగాది రోజు కచ్చితంగా పంచాంగ శ్రవణం చేయాలి అని మన సనాతన ధర్మం తెలియచేస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఉగాది శుభదినం.
నోట్: (ఇక్కడ ఇచ్చినవి ప్రజల నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి మా దగ్గర శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్టికల్‌ని అందించాం)