Ugadi 2023: ఉగాది రోజున పంచాంగ శ్రవణం తప్పనిసరా?
Ugadi 2023: ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలని హిందూ సనాతన ధర్మం చెబుతోంది.
By అంజి Published on 21 March 2023 4:30 PM ISTUgadi 2023: ఉగాది రోజున పంచాంగ శ్రవణం తప్పనిసరా?
Ugadi 2023: ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలని హిందూ సనాతన ధర్మం చెబుతోంది. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీశోభకృత్ నామ సంవత్సరం పేరుతో ఉగాది పండుగ జరుపుకుంటారు. మార్చి 22వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా పలు ఆలయాల్లో శోభకృత్ నామసంవత్సర పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే ఐదు అంగాలు అని అర్థం. అవి: నక్షత్రం, రాశి, యోగం, తిథి, కరణం. వీటి ఆధారంగానే హిందూ పండుగలు, శుభముహూర్తాల గురించి చెబుతుంటారు. సంవత్సరం మొత్తంలో శుభ ఫలాలు, అశుభ ఫలాల గురించి.. పంచాంగ శ్రవణం ద్వారా ముందే తెలుసుకుంటారు. అందుకు తగ్గట్టుగా వార్షిక ప్రణాళిక వేసుకుంటారు.
హిందూ పండుగలు, శుభ ఘడియల గురించి వివరణాత్మక సమాచారం హిందూ పంచాంగం ద్వారా తెలుస్తుంది. తిథి, నక్షత్రాలు, అనేక విధాలుగా కలిసి యోగాలను ఏర్పరుస్తాయి. జాతకాల కంటే పంచాంగ గణనాలపైనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పంచాంగం మరింత ఖచ్చితంగా మన విజయాలను, వైఫల్యాలను చెబుతుంది. ఇక పంచాంగం రెండు రకాలు. ఒకటి దృక్ పంచాంగం అయితే.. మరొకటి వాక్ పంచాంగం. వాక్ పంచాంగం.. గ్రహాల కదలికల ఆధారంగా గ్రహ స్థానాలను నిర్ణయిస్తుంది. ఉగాది రోజున చెప్పే పంచాంగం మనకు భవిష్యత్‌లో రాబోయే సమస్యల గురించి, వాటిని ఎలా అధిగమిస్తామే వివరిస్తుంది.
పంచాంగ శ్రవణం వెనుక ఆధ్మాత్మిక అర్థం కూడా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాల పురుషుడైనా శ్రీమహావిష్ణువును గౌరవించేందుకు ఉగాది రోజున ప్రతి గుడిలో పంచాంగ శ్రవణం చేస్తారు. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోడానికే పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణం చేయడం ద్వారా జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. పంచాంగ శ్రవణం కూడా విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. పంచాగం కర్మల నుంచి మనల్ని బయటపడేసేందుకు సహాయపడుతుంది.