పాక్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై మైక్ కీలక వ్యాఖ్యలు

By రాణి  Published on  7 Feb 2020 7:57 AM GMT
పాక్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై మైక్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్ లో హిందువులు మైనారిటీలు..! దేశ విభజన సమయం నుండి ఇప్పటి వరకూ ఆ దేశంలో హిందువులను ఎన్నో విధాలుగా హింసిస్తూనే ఉన్నారు. హిందువుల్లో పుట్టిన ఆడవాళ్ళకు అక్కడ కనీసం రక్షణ లేకుండా పోయింది. మైనారిటీ ప్రజలను అక్కడి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేశాయి. హిందూ యువతులను బలవంతంగా పెళ్ళాడటం, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి వారిని మార్పించడం.. ఎన్నో ఏళ్లుగా సాగుతూనే ఉన్న దారుణ చర్యలు ఇవి..! ఒకప్పుడు ఆ దేశంలో ఉన్న హిందూ-ముస్లిం నిష్పత్తిని, ఇప్పుడు ఉన్న నిష్పత్తిని చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

బుధవారం నాడు 27 వ 'నేషన్-ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అలియన్స్' లాంచ్ లో భాగంగా యుఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మాట్లాడుతూ పాకిస్థాన్ లో హిందువుల దుస్థితిపై పలు వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలను ప్రపంచం లోని చాలా దేశాల్లో హింసిస్తున్నారని.. ముఖ్యంగా పాకిస్థాన్ లో హిందువులను చాలా దారుణాతి దారుణంగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో పది మందిలో ఎనిమిది మంది తమ మతాలను స్వేచ్ఛగా ఆచరించలేకపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాలని.. ఎవరి మత స్వేచ్ఛ వారికి ఉండాలని ఆయన అన్నారు. తీవ్రవాదులు ఇరాక్ లోని యాజీదీలను, పాకిస్థాన్ లోని హిందువులను, నార్త్ ఈస్ట్ నైజీరియాలో క్రిస్టియన్ లను, బర్మాలో ముస్లింలను తీవ్ర హింసలకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. వీటిని ప్రపంచదేశాలన్నీ ఖండించాలని అన్నారు.

Next Story